హుస్నాబాద్, ఆగస్టు 5 : గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా గోదావరి జలాలను ప్రాజెక్టులోకి ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన మూడు మహాబలి మోటర్లను అధికారులు, ఇంజినీర్లు విజయవంతంగా ట్రయల్న్ చేశారు. ఈ నెల 31న ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ రెండో నంబర్ మోటర్‌ను స్విచ్ఛాన్ చేసి ట్రయల్న్‌న్రు ప్రారంభించారు.
అదేరోజు మిగతావి కూడా రన్ చేయాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో చేయలేక పోయారు. ఆగస్టు 1న మూడో మోటర్, 4న ఒకటో మోటర్‌ను ట్రయల్ చేయగా, అవి విజయవంతంగా నడిచాయి. మోటర్లను బిగించిన జపాన్‌కు చెందిన సాంకేతిక నిపుణులతో పాటు స్థానిక టెక్నీషియన్ల సమక్షంలో ట్రయల్న్ నిర్వహించారు. ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతం కావడంతో అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
మూడు మోటర్లలో ఒక్కో మోటర్ సెకనుకు రెండు వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లో ఎత్తిపోస్తాయి. ఒక్కోటి 32 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ మోటర్లు 126 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తాయి. రిజర్వాయర్ నిర్మాణంలో ప్రధాన భాగమైన పంపుహౌస్, మోటర్ల బిగింపు, టన్నెల్ నిర్మాణం, ట్రయల్ రన్ ప్రక్రియ ముగిసింది. మిగిలి ఉన్న ఐదు శాతం కట్ట పనులు పూర్తయితే రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో 8 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉండి హుస్నాబాద్ నియోజకవర్గంలోని లక్షా 6వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనున్నందున మెట్ట ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.