సిద్దిపేట అర్బన్, ఆగస్టు 5 : రౌడీలు, కేడీలు, సస్పెక్ట్‌ల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని సీపీ శ్వేత పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెం డింగ్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. దొంగతనాల కేసుల్లో టెక్నాలజీ ఉపయోగించి కేసులు ఛేదించాలన్నారు.
ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై వీపీఓలు, పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, క్రైం అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో సాక్షులను మోటివేట్ చేయాలని, కోర్టులో ట్రయల్ ఏ విధంగా నడుస్తుందో ప్రతిరోజు మానిటర్ చేయాలని ఏసీపీలకు సూచించారు.
గ్రేవ్ కేసుల్లో అరెస్టు చేయని నిందితులను త్వరగా అరెస్టు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసులను రాష్ట్ర కమిషన్లు, జాతీయ కమిషన్లు మానిటర్ చేస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ కేసుల పరిశోధనలో పకడ్బందీగా ఉండడంతో పాటు, టెక్నికల్ సాక్షాలు ఉంటే ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ నెంబర్ల గురించి తరచుగా మేజిస్ట్రేట్లు, కోర్టు అధికారులను కలిసి, ప్రతిరోజూ మానిటర్ చేసి, సీసీ నెంబర్లు తీసుకోవాలని సూచించారు.
హెచ్ఆర్ఎంఎస్ గ్రీవెన్స్ మాడ్యూల్ నందు అధికారులు, సిబ్బంది సర్వీస్‌కు సంబంధించిన సమస్యలు పంపించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి వెంటనే కేసు నమోదు చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేయాలని తెలిపారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండేలా చేయాలని, అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయన్నారు.
సీసీటీఎన్ఎస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి దరఖాస్తు, ఎఫ్ఐఆర్లను, సీడీఎఫ్, పార్డ్-1, పార్ట్-2, రిమాండ్ సీడీ, ఛార్జ్‌షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్లో ప్రతిరోజు ఎంటర్ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు సీఐలు, ఏసీపీలు మానిటర్ చేయాలని సూచించారు. నేరాలు జరిగే ప్రదేశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు హాట్ స్పాట్‌గా గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలన్నారు. భరోసా సెంటర్ సేవలు ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని, సీసీ కెమెరాలను ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ ద్వారా వచ్చే దరఖాస్తు విచారణ చేసి పిటిషన్ మాడ్యుల్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతిరోజు పెండింగ్ పిటిషన్ల గురించి మానిటర్ చేయాలని సీపీ సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, హుస్నాబాద్ సీఐ రఘుపతిరెడ్డి, చేర్యాల సీఐ శ్రీనివాసులు, సీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సీసీఎస్ సీఐ సంజయ్ పాల్గొన్నారు.