స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న వేళ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి యువతలో దేశభక్తి పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈనెల 8 నుంచి 22 వరకు 15 రోజులు దేశభక్తి ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపకల్పన చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చైర్మన్‌గా, కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ తదితర శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో వజ్రోత్సవాలను విజయవంతం చేసేలా కార్యాచరణను రూపొందిస్తుంది. ప్రతి ఇంటిపైనా జాతీయజెండా ఎగురవేసేలా చర్యలు తీసుకుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ వజ్రోత్సవాల్లో భాగస్వాములు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు.
సిద్దిపేట, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో “స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు” వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చక చకా ఏర్పాట్లు చేస్తున్నది. వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.జిల్లాకు చెందిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ తదితర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో వజ్రోత్సవాలను విజయవంతం చేసేలా కార్యాచరణను రూపొందిస్తారు.
దేశభక్తి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజల్లో కలిగించేలా వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8 నుంచి 22వతేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు, యువతీ యువకులు ఇలా అన్ని వర్గాల వారు ఈ వజ్రోత్సవాల్లో పొల్గొని విజయవంతం చేసే విధంగా రోజు వారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర ప్రతిష్టాత్మక భవనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జనసమ్మర్థ కూడళ్లు తదితర ప్రాంతాలను 15 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ప్రతి రోజూ ప్రార్థన సమయంలో దేశభక్తి గీతాలు వినిపిస్తారు. దేశభక్తి పాటలతో పాటుగా వ్యాస రచన పోటీలు, చిత్రలేఖనం, కవితా రచన పోటీలు తదితర వాటిని నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు. గ్రామ, మండల, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల వారిని ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తారు. జిల్లాలో కనీవినీ ఎరగని రీతిలో ఉత్సవాలు నిర్వహించే విధంగా చక చకా ఏర్పాటు జరుగుతున్నాయి. 15 రోజుల పాటు వేడుకలు జరుగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే పనులు చేస్తున్నారు. జిల్లాలోని విద్యార్థులు, యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి వివిధ కార్యక్రమాలు చేపడుతారు. ప్రతిఇంటి పై జాతీయ జెండా ఎగురవేసేలా ఈనెల 9న జాతీయ పతాకాలు పంపిణీ చేయనున్నారు. గ్రామాలకు పంపిణీ చేసే పతాకాలను జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నారు.