ఈ ఏడాది ఇప్పటివరకు కురసిన వర్షాలతో భూగర్భ జల మట్టాలు భారీగా పెరిగాయి. జూన్ మాసంలో మోస్తరు వానలు కురువగా, జూలైలో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లి& చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మెదక్ జిల్లాలో సాధారణం కంటే 687 మిల్లిమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. 1257 చెరువులు పూర్తిగా నిండగా, 1548 చెరువులు 70శాతం, 32 చెరువులు 50శాతం నిండాయి. గత ఏడాది జూలైలో నీటిమట్టం 13.79 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 11.22 మీటర్లకు పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు 2.15 మీటర్ల మేర పెరిగాయి. ఏడు మండలాల్లో ఐదు మీటర్లు, ఎనిమిది మండలాల్లో పదిమీటర్లలోపుపైకి వచ్చాయి. అమీన్పూర్లో కేవలం 1.22 మీటర్ల లోతులోనే ఉన్నాయి. సింగూరు, నారింజ, నల్లవాగు ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. 363 చెరువులు అలుగులు పారగా, 262 నిండుగా ఉన్నాయి. 1020 చెరువుల్లో 75 శాతం, 799 చెరువుల్లో సగం నీళ్లు ఉన్నాయి. నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వానకాలంతో పాటు వచ్చే యాసంగి సాగు, తాగునీటికి ఢోకాఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
మెదక్/ సంగారెడ్డి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. వానకాలం సీజన్ ఆరంభంలోనే తొలకరి జల్లులు కురవడం, వెనువెంటనే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జూన్‌లో వరుణుడు ముఖం చాటేసినా తర్వాత జూలై నెలలో నిరాటంకంగా కురిసిన భారీ వర్షాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. మెదక్ జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం ప్రస్తుతం 11.22 మీటర్లలోనే లభ్యమవుతుండడం గమనార్హం. సంగారెడ్డి జిల్లాలో భూగర్భజల మట్టాలు 4.27 సెం.మీటర్ల మేర పైకి వచ్చాయి.
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు 4.27 సెం.మీటర్ల మేర పైకి వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 2.15 మీటర్ల మేర భూగర్బజల మట్టాలు పెరిగాయి. అమీన్పూర్ మండలంలో కేవలం 1.22 మీటర్ల లోతులోనే జలాలు ఉండగా, హత్నూర మండలంలో 19.51 మీటర్ల లోతున ఉన్నాయి. భూగర్భజలాలు పైకి ఉబికి వస్తుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వసామర్థ్యం 29.917 టీఎంసీ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 28.510 టీఎంసీల జలాలు ఉన్నాయి. జిల్లాలోని నారింజ ప్రాజెక్టు, నల్లవాగు ప్రాజెక్టు నీటితో నిండుగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వర్షాలతో జిల్లాలోని 363 చెరువులు అలుగులు పారాయి. 262 చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. 1020 చెరువులు 75 శాతం నీటితో ఉండగా, 799 చెరువులు సగం నిండాయి.
ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే 687 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పెరిగింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండి పొంగిపొర్లాయి. జిల్లా వ్యాప్తంగా 2837 చెరువులు ఉండగా, వాటిలో 1257 చెరువులు పూర్తిగా నిండాయి. 1548 చెరువులు 70శాతం నిండగా, 32 చెరువులు 50 శాతం నిండాయని ఇరిగేషన్‌శాఖ అధికారులు తెలిపారు.
జూన్‌లో భూగర్భ నీటిమట్టం 15.03 మీటర్లు ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలకు జూలై నెల చివరి వరకు 11.22 మీటర్ల నీటిమట్టం పెరిగింది. 3.81 మీటర్లు భూగర్భ జలమట్టం పెరిగింది. గత ఏడాది జూలైలో 13.79 మీటర్లు ఉండగా, గత ఏడాది కంటే 2.57 మీటర్ల నీటి మట్టం పెరిగింది. ఒక్క నెలలోనే జలాలు పైపైకి వచ్చాయి. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి.
దీంతో అన్ని మండలాల్లోనూ సరాసరి నీటిమట్టాలు పెరిగాయి. గతంలో సరైన వర్షాలులేక వట్టిపోయిన బోర్లన్నీ ఇప్పుడు పోస్తున్నాయి. వదిలేసిన బోర్లలో నీరు ఉబికి వస్తుండడంతో రైతులు మోటర్లు బిగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. అయితే యాసంగి పంటలకు కూడా ఢోకా లేకుండాపోయింది. ఇప్పుడు కురిసిన వర్షాలతో వచ్చే రెండు మూడేండ్లదాకా నీళ్ల ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు.
జిల్లాలో 59 చోట్ల ఫీజోమీటర్లతో భూగర్భ జలాలను కొలిచాం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లాలో వట్టిపోయిన బోర్లలో నీరు ఉబికివస్తుంది. ఈసారి రెండు పంటలకు ఢోకాలేదు.
– లావణ్య, మెదక్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి