కొల్చారం, ఆగస్టు 4: తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీలు సేవాదృక్పథంతో పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. మండల పరిధిలోని అప్పాజిపల్లిలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ బ్రహ్మజీతో కలిసి పాల్గొన్నారు.
వారికి అంగన్వాడీ చిన్నారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, ఐదేండ్లలోపు చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని రక్తహీనతను మెరుగుపర్చే ఐరన్ (పోలిక్ యాసిడ్) మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. దీంతో పాటు కాల్షియం కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
అనంతరం చిన్నారులకు కలెక్టర్ బాలామృతాన్ని తినిపించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ బ్రహ్మజీ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింతగా విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయా రు చేసి ఇవ్వాలని పంచాయత్రా జ్ ఏఈ ఇర్ఫాన్ హుస్సేన్‌ను ఆదేశించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కా ర్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలో పారిశుధ్య పనులపై శ్రద్ధ కనబర్చాలని సర్పంచ్ ఝాన్సీలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీనర్సమ్మ, డిప్యూటీ తహసీల్దార్ కిశోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి ఫణీంద్రకృష్ణ, అంగన్వాడీ టీచర్లు పద్మ, భాగ్యలక్ష్మి, చలం యాదగిరి పాల్గొన్నారు.