జహీరాబాద్, మే 27: సంగారెడ్డి జిల్లాలో 7.45 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు భూములు సిద్ధం చేస్తున్నారని, వ్యవసాయ శాఖ అంచనా వేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తెలిపారు. విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు నిల్వలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వానకాలం సాగుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
4 లక్షల ఎకరాల్లో పత్తి, 1.8 లక్షల ఎకరాల్లో కంది , 79 వేల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 29 వేల ఎకరాల్లో చెరుకు, 22 వేల ఎకరాల్లో పెసర్లు, 24 వేల ఎకరాల్లో మినుము, 78 వేల ఎకరాల్లో సోయా సాగు చేసే ఆవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ చేశామన్నారు.
డీఏపీ, యూరియా, ఇతర ఎరువులు 50 శాతం గోదాముల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. డీసీఎంఎస్, సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారులతో ఎరువులు, విత్తనాలు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితు వ్యాపారులపై పీడీ చట్టం ఉపయోగించేందుకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. డీసీఎంఎస్‌లో సోయా విత్తనాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ మొదటి వారంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు డబ్బులు కూడా జమ చేయనున్నట్లు తెలిపారు.