మెదక్, (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి, కలెక్టరేట్, ఆగస్టు 4: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లు హరీశ్, శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లలోని సమావేశ మందిరాల్లో వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదన్నారు. జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ జాతీయ పతాకాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.
11వ తేదీలోగా ప్రతి ఇంటికీ పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు జాతీయ జెండాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసేలా అధికారులు చూడాలని కలెక్టర్లు తెలిపారు. దీనికి గాను కరపత్రాలు, గ్రామాల్లో చాటింపు, మైక్‌ల ద్వారా అందరికీ తెలిసేలా జాతీయ పతాకాన్ని ఎలా ఎగురవేయాలనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మిగిలిన రోజుల్లో కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ నెల 8 నుంచి 21 వరకు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 8న ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 100 మీటర్ల త్రివర్ణ పతాకంతో ర్యాలీ ఉంటుంది. 9న ఇంటింటికీ జాతీయ పతాకాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు.
10న గ్రామ స్థాయిలో మొక్కలు నాటడం, 11న ఫ్రీడం రన్, 12న వజ్రోత్సవ వేడుకలపై విస్తృత ప్రచారం, త్రివర్ణ రాఖీల పంపిణీ , 13న వజ్రోత్సవ ర్యాలీలో విద్యార్థులు, యువజనులు, మహిళలు, సామాజిక బృందాలతో నిర్వహించడం, 14న సాంస్కృతిక, జానపద కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం, పటాకులు పేల్చడం, 15న జిల్లా కేంద్రంలో ఇంటింటా జెండా ఆవిష్కరణ, 16న జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ గీతాలాపన, మండల కేంద్రాల్లో కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న వజ్రోత్సవాలపై పాఠశాల, కళాశాల, జిల్లా స్థాయి వారీగా క్రీడా పోటీలు, 19న దవాఖానలు, జైళ్లు, అనాథాశ్రమాల్లో పండ్ల పంపిణీ, 20న జాతీయ సమైక్యతకు అద్దంపడుతూ రంగోలీ పోటీలు, ఈ నెల 21వ తేదీన గ్రామ, మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు, 22న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు.
నిర్వహించాలని కలెక్టర్లు సంబంధిత అధికారులకు వివరించారు. సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, ఆర్అండ్బీ అధికారి శ్యామ్‌సుందర్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లు శ్రీహరి, చాముండేశ్వరి, మోహన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.