నారాయణరావుపేట, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. ఆకుపచ్చని చెట్లతో పాఠశాలలో చల్లదనంతో విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచుతూ చూపరులను సైతం ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని నారాయణరావుపేట, గుర్రాలగొంది, జక్కాపూర్, మల్యాల, గోపులాపూర్ తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చని చెట్లతో హరితతోరణంలా కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రభుత్వాలు పాఠశాలలను పట్టించుకోక, పిచ్చిమొక్కలు పెరిగేవి. కానీ, నేడు ఎటు చూసినా పాఠశాలలు హరిత వనాలుగా దర్శనమిస్తున్నాయి.
హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా మొదటి విడత హరితహారం నుంచి నేటి వరకు పాఠశాలల్లో సుమారు 5 వేల మొక్కలు నాటారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలు, కిచెన్ గార్డెన్లో కూరగాయల సాగు, పూల మొక్కలు నాటారు. దీంతో పాఠశాల ఆవరణలో ఎటు చూసినా పచ్చని మొక్కలతో పాఠశాలలు హరిత వనాలను తలపిస్తున్నాయి. వీటిని సంరక్షించేందుకు పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం హరిత కమిటీలు వేసి పచ్చదనాన్ని కాపాడుతున్నారు. వీరికి స్థానికి ప్రజాప్రతినిధులు సైతం సహాయం చేస్తున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆవరణలో విరివిగా మొక్కలు నాటాం. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థులు సైతం వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని రక్షిస్తున్నారు.
– ఎ.నరసింహరెడ్డి, హెచ్ఎం, గుర్రాలగొంది పాఠశాల
ఎటు చూసినా పచ్చదనంతో కనిపించేలా పాఠశాల ఆవరణలో పూల మొక్కలు నాటాం. అదే విధంగా పాఠశాలకు పనికొచ్చే కూరగాయలను సైతం సాగు చేశాం. నాటిన ప్రతి మొక్కనూ బతికించేందుకు మా విద్యార్థులతో పాటు మేము కూడా కృషి చేస్తున్నాం.
– జే.కిష్టయ్య, హెచ్ఎం, యూపీఎస్ మల్యాల