కొమురవెల్లి, జూలై 28: వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా.. శుభముహూర్తం వెతుకుతాం.. అదేరోజు.. అదే సమయానికి సంప్రదాయంగా జరుపుతాం. ముఖ్యంగా వివాహాలు కచ్చితంగా అదే ముహూర్తానికి జరగాలని అందరూ భావిస్తారు. కొవిడ్ అనంతరం రెండేండ్ల తర్వాత పెండ్లి మంత్రాలు మారుమోగుతున్నాయి. తమ పిల్లల వివాహాలు అందరూ గుర్తుంచుకునేలా తల్లిదండ్రులు పలు విధాలుగా ప్రయత్నిస్తుంటారు.
అందుకు ఆలస్యమైనా, అన్నీ సవ్యంగా కుదిరాకే పెండ్లిండ్లు చేస్తుంటారు. కానీ, ఈ ఏడాది సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా నిశ్చితార్థం మొదలు, ఉరుకులు పరుగులతో పెండ్లిండ్లు కానిస్తున్నారు. ఈ యేడాది ప్రారంభం నుంచి జూన్ మాసం వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండటంతో అందరూ బిజీగా గడిపారు.
పెండ్లంటే రెండు కుటుంబాలు కలువడం అంటారు. అంతేకాదు, పెండ్లి ఏర్పాట్లతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పెండ్లంటే ముందుగా గుర్తచ్చేవి శుభలేఖలు, పట్టుచీరలు వధూవరుల పెండ్లి బట్టలు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్, పెండ్లి మండపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్ మేళాలు తదితర వారికి పని దొరుకుతుంది.
రెండేండ్లుగా కరోనా దెబ్బతో చాలా మంది పెండ్లి మాట ఎత్తలేదు. కొంతమంది పెండ్లి ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనల కారణంగా పెండ్లిలను వాయిదా వేశారు. ఈ సంవత్సరం కరోనా ఉధృతి తగ్గడంతో కొత్త సంవత్సరం మొదలుకొని జూన్ వరకు వేలాది వివాహాలు జరిగాయి. జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన పెండ్లిండ్ల ముహూర్తాలకు ఆగస్టులో మంచి ముహూర్తాలు ఉన్నప్నటికీ అవి 10 రోజులు మాత్రమే ఉండడం ఆపై డిసెంబర్ వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో నిశ్చయ తంబూలాలు తీసుకున్నవాళ్లు అప్పటి వరకు ఆగడం ఎందుకన్న ఉద్దేశంతో పెండ్లికి తొందర పడుతున్నారు.

కొవిడ్‌తో వరుసగా రెండేండ్లుగా దెబ్బతిన్న వ్యాపారాలు, ఈ సంవత్సరం జరిగిన వివాహాలతో కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వివాహాలు వేల సంఖ్యలో జోరుగా సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు పెరగడంతో అన్నిరకాల షాపులు కళకళలాడుతున్నాయి.
ఆషాఢ మాసం కారణాంగా నెల రోజులు పెండ్లిండ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో కేవలం 10 రోజులు మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాలు తప్పితే, డిసెంబర్ వరకు ఐదు నెలల పాటు ఆగాల్సిందే. అటుపై కూడా వచ్చే ఉగాది వరకు శుభముహూర్తాలు లేనందున వీలైతే శ్రావణ మాసంలో లేదా డిసెంబర్లో ఉన్న ముహూర్తాల్లో పిల్లలకు పెండ్లిండ్లు చేసేందుకు తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పెండ్లి, శుభ కార్యాలకు ముహూ ర్తాలకు సంబంధించి లగ్న పత్రికలు రాయించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పెండ్లి కార్డులు ఆర్డర్లు ఇచ్చారు. కల్యాణ మండపాలకు అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. అటుపై విరామ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తప్పేట్లు లేవు.
– మహాదేవభట్ల ఆనంద్‌శర్మ, వేదపండితుడు, గురువన్నపేట

జనవరి నుంచి జూన్ వరకు శుభముహుర్తాలతో వేలాది పెళ్లిళ్లు జరగగా, జూలైలో ఆషాఢ మాసంతో పెండ్లిండ్లకు బ్రేక్‌లు పడ్డాయి.
ఆగస్టు శ్రావణ మాసంలో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.
సెప్టెంబర్‌లో భాద్రపద మాసం, శుక్ర మూఢమి ప్రారంభంలో ముహూర్తాలు లేవు. అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్ర మూఢమితో మంచి రోజులు లేవు.
డిసెంబర్లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.