సిద్దిపేట, జూలై 28 : సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, దవాఖాన పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలను మెరు గుపర్చాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని అన్ని వైద్య విభాగాలు, వైద్య పరికరాలను పరిశీలించి, వాటి పని తీరు అడిగి తెలుసుకున్నారు. రోగులతో మా ట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు టైమ్‌కు వస్తున్నారా? అవసరమైన మందులు ఉచితంగా ఇస్తున్నారా? అని అడిగారు.
అన్ని అధునాతన వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారని, ప్రైవేటు దవాఖానలకు వెళ్లి, ఇబ్బందులకు పడొద్దన్నారు. ప్రసూతి వార్డుకెళ్లి, రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నారు? సాధారణ ప్రసవాలు ఎన్ని? ఆపరేషన్లు ఎన్ని? అని ఆరా తీశారు. లేబర్ రూమ్‌లో బర్త్ చైర్ కావాలని వైద్యులు కోరగా, ఏర్పాటు చేస్తానని కలెక్టర్ చెప్పారు. టాయిలెట్స్‌ను పరిశీలించి ఎంతమంది శానిటరీ వర్కర్లు పని చేస్తున్నారని అడిగారు. దవాఖానలో వైద్యంతో పాటు శానిటేషన్ కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌ను పరిశీలించి, నిర్ణీత సమయంలో రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ కౌంటర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పార్థివ వాహనం, దవాఖాన కంట్రోల్లో బయో మెడికల్ వేస్ట్ సేకరించే గదికి అవసరమైన రిపేర్లు చేయాలని సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు. రోగుల సహాయక గది పరిసరాల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి పిచ్చి మొక్కలు తొలిగించాలన్నారు.
నీరు నిల్వ ఉండకుండా మట్టి పోయించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డికి ఆదేశించారు. రోగుల సహాయకులు ఆరుబయట కూర్చునేలా రేకుల షెడ్లు నిర్మించాలని టీఎస్ ఎంఐడీసీ డీఈ విశ్వప్రసాద్‌ను ఆదేశించారు. అనంతరం మెడికల్ కాలేజీ ఆవరణలో రూ.266 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ దవాఖాన భవన పనులను పరిశీలించి, నిర్ణీత సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. మెడికల్ కాలేజీ స్టాఫ్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. కళాశాలలోని వైద్య కోర్సులు, ప్రొఫెసర్లు, ఇతర స్టాఫ్ వివరాలను ప్రిన్సిపాల్ విమలా థామస్‌ను అడిగి తెలుసుకున్నారు.