‘అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి’..అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. మండలాలు, గ్రామాల వారీగా ప్రగతి పనులపై ఆరాతీశారు.
పార్టీని బలోపేతం చేసేందుకు వారం, పది రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభించను న్నట్లు పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన వారు, రెండు డోసులు వేసుకున్న ప్రతి ఒక్కరూ కరోనా బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు.
సిద్దిపేట, జూలై 28 : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. ఆయా మండలాలు, గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు పనుల పెండింగ్‌లో ఉన్నాయని, వారం పదిరోజుల్లో పనులు పూర్తి కావాలని సూచించారు.
పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధుల మం జారు చేశామని, త్వరగా పనులు ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ భవనాలు పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల గుత్తేదారుతో మాట్లాడి, త్వరగా పూర్తి చేయాలన్నారు. అధికారులతో కలిసి అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు.
నియోజకవర్గంలో పూర్తయిన పనులను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. నారాయణరావుపేటలో డబుల్ ఇండ్లను ఆగస్టు మొదటివారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఇర్కోడు, పాలమాకుల గ్రామాల్లో ఆర్హులైన లబ్దిదారులని ఎంపిక చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు, గృహ ప్రవేశాలకు ఇండ్లను సిద్ధం చేయాలని సూచించారు.
వచ్చే వారం, పది రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ఆ దిశగా అన్ని గ్రామాల్లో బూత్ స్థాయిలోప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.
సిద్దిపేటలోనే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోబోతున్నామని, 2వేల ఎకరాల్లో మొదటి దశలో సాగు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌లో మరో 5వేల ఎకరాలు సాగుకు రైతులు సిద్ధమయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. దవాఖాన సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్‌తో దవాఖాన పని తీరుపై సమీక్షించారు. వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో డెంగీ, మలేరియా వంటి కేసులు వస్తాయని, అందుకు దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. పేషెంట్ల కుటుంబ సభ్యులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు.
18 ఏండ్లు నిండిన వారు, రెండు డోసులు వేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అందుబాటులో ఉన్నారన్నారు. రెండు డోసులు వేసుకోని ఆరు నెలలు నిండిన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. సమీక్షలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయి రాం, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఎంపీపీ మాణిక్యరెడ్డి, జడ్పీటీసీలు శ్రీహరి, ఉమావెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సారయ్య, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, సదానందం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, సోమిరెడ్డి, పిండి అరవింద్, సాయి పాల్గొన్నారు.