కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధి చేసేందుకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 216 నీటి వనరుల పరిధిలో 193 మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, మరో 27 కొత్త సొసైటీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా వెయ్యి మందికిపైగా మత్స్యకారులకు సభ్యత్వం లభించనున్నది. కొత్త సభ్యులకు ప్రభుత్వ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, బీమా సౌకర్యం లభించనున్నాయి. సంఘాల్లో చేరే వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికే మెంబర్షిప్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు పది సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
సంగారెడ్డి, మే 27(నమస్తే తెలంగాణ): కొత్త సొసైటీల ఏర్పా టు, సభ్యత్వం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటి వనరులపై కొత్త సొసైటీలతోపాటు మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు కొత్త సొసైటీల ఏర్పాటుపై మత్స్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అధికారులను కసరత్తు ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలో 216 నీటి వనరుల పరిధిలో ప్రస్తుతం 193 మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందు లో మొత్తం 10,434 మంది సభ్యులు ఉన్నారు. అందోలులో 56 సొసైటీలు, సంగారెడ్డిలో 35, పటాన్చెరు 48, నారాయణఖేడ్ 19, జహీరాబాద్ 9, హత్నూర 26 సొసైటీలు ఉన్నాయి. 193 సొసైటీల్లో మత్స్యకార సహకార సంఘాలు 161 ఉన్నా యి. ఇందులో 9124 మంది సభ్యులున్నారు. జిల్లాలో 13 మహిళా మత్స్యకార సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో 502 మంది మహిళా సభ్యులు ఉన్నారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందే వారి కోసం మత్స్యశాఖ ప్రత్యేకంగా మత్స్య పారిశ్రామిక సహకార లైసెన్స్‌దారుల సొసైటీలు 19 ఏర్పాటు చేసింది. పుల్కల్, మనూరు, వట్పల్లి, రాయికోడ్, న్యాల్కల్, సదాశివపేట, చౌటకూరు మండలాలకు చెందిన 808 మంది ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరు కేవలం సింగూరు ప్రాజెక్టు పరిధిలో చేప లు పట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
జిల్లాలోని 196 నీటి వనరులపై కొత్తగా 27 సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో 1000 మందికిపైగా సభ్యత్వం లభించను న్నది. 11 మంది సభ్యులతో మత్స్యకార పారిశ్రామిక సహకార సొసైటీ ఏర్పాటు చేసుకోవచ్చు. సొసైటీగా ఏర్పాటైన మత్స్యకారులకు ప్రభుత్వం చేపలతో పాటు రుణాలు, బీమా సౌకర్యం కల్పిస్తున్నది. కొత్త సొసైటీలు, సభ్యులకు ప్రభుత్వ పథకాలు వర్తించడంతో పాటు సబ్సిడీ అందుతుంది.
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా గంగపుత్ర, బెస్త, ముదిరాజ్, గూళ్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఈ సొసైటీల్లో సభ్యులుగా ఉంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 27 సొసైటీల్లో వీరే సభ్యులుగా ఉంటారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక చెరువు పరిధిలో తక్కువలో తక్కువ 11 మంది సభ్యులతో మత్స్యకార పారిశ్రామిక సహకార సొసైటీ ఏర్పాటు చేయవచ్చు. కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలంటే గ్రామంలో నీటి వనరు (చెరువు), విస్తీర్ణం 22 ఎకరాలు ఉండాలి. కాల్వ లేదా ఏడాది పొడవునా నీరుండే చెరువు అయితే కనీసం 11 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. గ్రామం లో ఇదివరకు ఏదైనా మత్స్య సహకార సొసైటీ ఉంటే ఆ సంఘం నుంచి విడదీస్తూ కొత్త సొసైటీ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తీర్మానించాలి.
సంగారెడ్డి జిల్లాలో 196 నీటి వనరుల పరిధిలో కొత్తగా 27 సొసైటీలు ఏర్పాటు చేస్తున్నారు. పుల్కల్ మండలంలో మూడు, అమీన్పూర్లో ఒకటి, రాయికోడ్‌లో ఒకటి, మొగుడంపల్లిలో రెండు, నారాయణఖేడ్‌లో మూడు, సిర్గాపూర్‌లో రెండు, ఝరాసంగంలో రెండు, కల్హేర్‌లో నాలుగు, కొండాపూర్‌లో రెండు, జిన్నారంలో ఒకటి, పటాన్చెరులో రెండు, అందోలులో ఒకటి, మునిపల్లిలో ఒకటి, సదాశివపేటలో రెండు కొత్త మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు కానున్నాయి.
27 కొత్త సొసైటీల్లో 1000 మందికిపైగా మత్స్యకారులకు సభ్యత్వం లభించే అవకాశం ఉంది. కొత్త సొసైటీ ఏర్పాటులో భాగంగా సభ్యత్వం తీసుకునే మత్స్యకారులు వారు చేపలు పడతారా లేదా అన్నది తెలుసుకునేందుకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగ్గిన వారికి సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వనున్నారు. 27 కొత్త సొసైటీలకుగాను ఇప్పటికే పది సొసైటీలు ఏర్పాటు చేసి మత్స్యశాఖ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే 17 సొసైటీలకు నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నారు.
సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలంటే మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవోనోపాధి సాగిస్తూ 18 ఏండ్లు వయస్సు నిండి ఉండా లి. జీవో ఎంఎస్ 98లో గుర్తించిన 30 మత్స్యకార కులాలకు చెందిన వారు సొసైటీల్లో సభ్యత్వం పొందేందుకు అర్హులు. సొసైటీల్లో సభ్యత్వం కావాలనుకునే మత్స్యకారులు కుల, స్థానికత ధ్రువీకరణ పత్రాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కొత్త సొసైటీల ఏర్పాటు, సభ్యత్వంతో మత్స్యకారులకు బీమా సౌకర్యంతోపాటు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ అందనున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 196 నీటి వనరుల పరిధిలో కొత్తగా 27 మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు చేస్తున్నాం. వెయ్యి మందికిపైగా సభ్యత్వం లభించే అవకాశం ఉంది. ఇది వరకే 10 సొసైటీల్లో మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు పూర్తి చేశాం. మరో 17 సొసైటీల పరిధిలో పరీక్షలు పూర్తి చేసి, త్వరలోనే సభ్యత్వాలు ఇవ్వనున్నాం. దీంతో మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది.
– సతీశ్, ఏడీ, ఫిషరీస్, సంగారెడ్డి