పుల్కల్, జూలై 28 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. దీంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నిండు కుండలా మారి సింగూరును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా పట్టణాల నుంచి సైతం సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
కాగా, కొన్ని రోజులుగా ప్రాజెక్టులోకి కొనసాగిన వరద గురువారం నాటికి కాస్త తగ్గు ముఖం పట్టింది. జూలై నెలలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ఇదే మొదటిసారని నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 15 టీఎంసీల వరద వచ్చిందని ఆయన తెలిపారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సింగూరు ప్రాజెక్టులోకి 3897 క్యూసెక్కుల నీరు వచ్చిందన్నారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 27.920 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇందులో 1345 క్యూసెక్కులు జల విద్యుత్ కేంద్రం ద్వారా, 250 క్యూసెక్కులు ఆవిరి అవుతుండగా, హైదరాబాద్ తాగు నీటి సరఫరా కోసం 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 70 క్యూసెక్కులు, మొత్తానికి 1745 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.