మెదక్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో మరింత మెరుగైన వైద్య సేవలందించేలా చూడాలని అందుకు వైద్యులందరూ కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి జిల్లా వ్యాప్తంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం అందుతున్న సేవలు, అందాల్సిన సేవలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులందరూ సకాలంలో అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ దవాఖానకు దూర ప్రాంతాల నుంచి కాన్పులు చేయించుకునేందుకు ఎందరో గర్భిణులు వస్తుంటారని, వారికి సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు చేసేలా చూడాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని డెలివరీలు జరిగాయి.. అందులో నార్మల్ డెలివరీలు ఎన్ని ఉన్నాయనే వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సేవలు బాగానే ఉన్నాయని అలాగే ఔట్ పేషెంట్ల సంఖ్య మరింత పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు సూచించారు.
సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు చేసేలా ప్రయత్నించాలని గైనకాలజిస్టు డాక్టర్ శివదయాల్కు తెలిపారు. దవాఖానలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సివిల్ సర్జన్, గైనకాలజీ హెడ్ డాక్టర్ శివదయాల్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.