ఝరాసంగం, జూలై 28 : శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గురువారం తెల్లవారుజమునుంచే తెలంగాణరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం ప్రారంభం కావడమే కాకుండా అమావాస్య కావడంతో మొదటి రోజు ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులు అమృత గుండం నీటితో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం భక్తులు గర్భగుడిలో ఉన్న పార్వతీ సమేత సంగమేశ్వరుడికి కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకుపూజ, అన్నపూజలు భక్తులచే వేదపండితులు చేయించారు.
ఆలయ మండపంలో స్వామి వారి ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకం చేసి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రాజేందర్రెడ్డి పర్యావేక్షించారు. ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి, సిబ్బంది కలిసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.