పెద్దశంకరంపేట, జూలై 28 : ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) తరుణ్చక్రవర్తి అన్నారు. గురువారం మండలపరిధిలోని ఉత్తులూరు, వీరోజిపల్లి గ్రామాల్లో శానిటేషన్ పనులు, మురుగునీటి కాల్వలను ఆయన పరిశీలించారు. దీంతోపాటు గ్రామపంచాయతీల్లో రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను డీపీవో పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని, స్థానిక ప్రజాప్రతి నిధులు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. అధికారులు విధులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీడీవో రియాజొద్దీన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్‌లు రుక్మిణీరవీందర్, పార్వతీశంకర్గౌడ్, ఎంపీటీసీ దామోదర్ తదితరులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 28 : మున్సిపాలిటీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బల్దియా అధికారులు చర్యలు చేపట్టా రు. పట్టణంలోని పలు వార్డుల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో వైద్యశిబిరాలను నిర్వహించి, ప్రజలకు ఉచితంగా మందు లు అందజేశారు.
వార్డుల్లోని మురుగునీటి కాల్వలు శుభ్రం చేసి, దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఆశ వర్కర్లు, మెప్మా మహిళలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన పరుస్తున్నారు. ఇంటి ఆవరణ లేదా పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇండ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిలో దోమల నివారణకు ఆయిల్ బంతులు వేస్తున్నారు. వాటర్ ట్యాంకుల్లో నీటిని క్లోరినేషన్ చేస్తున్నారు. 6, 12, 25వ వార్డుల్లో నిర్వహించిన వైద్యశిబిరాలను కౌన్సిల ర్లు కృష్ణారెడ్డి, రాగి వనజ సందర్శించి ప్రజలకు సీజనల్ వ్యా ధుల నివారణపై పలు సూచనలు చేశారు. జాగ్రతలు పాటిస్తే వ్యాధులు ధరి చేరవని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.
నిజాంపేట, జూలై 28 : మండలంలోని చల్మెడ, నస్కల్ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి నాగరాజు పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలను పరిశీలించారు. నిల్వ బియ్యం తిరిగి ఇచ్చి, కొత్త బియ్యం తెచ్చుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేందర్, సర్పంచ్ నర్సింహరెడ్డి, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, కార్యదర్శి నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
– సర్పంచ్ కల్లూరి కీర్తనాహనుమంతరావు
శివ్వంపేట, జూలై 28 : ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడంతోపాటు నీటి నిల్వలు తొలిగించాలని ఏదుల్లాపూర్ సర్పంచ్ కల్లూరి కీర్తనాహనుమంతరావు అన్నారు. ఏదుల్లాపూర్ గ్రామంలో శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యసిబ్బంది వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. వేడి చేసి, చల్లార్చిన నీటిని తాగాలన్నారు. గ్రామంలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులు చేయిస్తున్నట్లు పేర్కొ న్నారు. ప్రజలందరూ గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండురంగం, వైద్యులు సంతోష్, సంధ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొల్చారం, జూలై 28 : మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్రజలు ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి పద్మజ సూచించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కిష్టాపూర్, కొంగోడులో ఎంపీడీవో ప్రవీణ్, పైతర, కొల్చారంలో మండల ప్రత్యేకాధికారి పద్మజ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. పంచాయతీ సిబ్బంది గ్రామాల స్వచ్ఛతకు పాటుపడాలని సూచించారు.