నర్సాపూర్, జూలై 28 : కౌడిపల్లి మండలంలో ఈ నెల 22న జరిగిన ఓ వ్యక్తి మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి మృతికి చెందిన వివరాలను ఎస్పీ రోహిణిప్రియదర్శిని వెళ్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకా రం.. సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామానికి చెందిన చింతల మనోహ ర్, పవన్‌కుమార్, వెంకట్రామ్లు ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఈ నెల 22న మద్యం సేవించి కారు నడుపుతూ సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌కు వచ్చారు.
నర్సాపూర్‌లో ఆగి బిర్యాని తిని సిద్దిపేటలో మిత్రుడి ఇంటి నిర్మాణ పనులను చూడటానికి బయలుదేరారు. కౌడిపల్లి వద్ద పాపన్నపేట మండలం చీకోడు గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు(32) రోడ్డుపై కూర్చొని ఉన్నాడు. మధ్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ రాజును ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంతో కారును వ్యక్తి పైనుంచి తీసుకెళ్లడంతో శరీర భాగాలు ముక్కలు ముక్కలయ్యాయి.
కొద్దిసేపటికి కారును యూటర్న్ తీసుకొని వచ్చి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపో యారు. దీన్ని చూసిన పోలీసులు అక్కడి ఆనవాళ్లను బట్టి హత్య కేసుగా నమోదు చేశారు. తూ ప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డితో పాటు సీఐ షేక్‌లాల్ మధార్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు.
మొదటగా కారు నంబర్‌ను తెలుసుకుని కారు యజమాని అల్వాల్ సత్యనారాయణను విచారించగా ఈ కేసు వివరాలు బయటపడ్డాయి. ఈ మేరకు ముగ్గురు నింధితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ షేక్లాల్మధార్, ఎస్సై శివ ప్రసాద్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది రాము, భాగయ్య, పోచయ్య, రాజు, దుర్గారెడ్డి, ఎస్కే అలీలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అభినందించారు.