పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ప్రతి నెలా వందల టన్నులు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నది. ఇందుకు జహీరాబాద్ అడ్డాగా మారింది. స్థానిక వ్యాపారులతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు డీలర్లు, వ్యాపారులు వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో బియ్యాన్ని రూ.10 నుంచి 14 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. గుజరాత్, మహారాష్ర్టాల్లో దొడ్డు బియ్యానికి ధర అధికంగా పలుకుతుండడంతో ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడ రూ. 20 నుంచి రూ. 30 వరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు.
సేకరించిన బియ్యాన్ని జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూతపడిన ఫ్యాక్టరీలు, ఫాంహౌస్‌లు, శివారుల్లో రేకుల షెడ్లు నిర్మించి నిల్వ చేస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, ఎంతటి వారినైనా వదిలి పెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్, పౌరసరఫరాల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. వారం రోజుల్లో జహీరాబాద్‌లో మూడు లారీల బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు.
జహీరాబాద్, జూలై 28 : అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని వదలడం లేదు. సంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని కొందరు జహీరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతినెలా వందలాది టన్నుల బియ్యం ఇతర రాష్ర్టాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినప్పటికీ కొందరు అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తున్నది. మూసివేసిన ఫ్యాక్టరీలు, ఫాంహౌస్‌లు, శివారుల్లో రేకుల షెడ్లు నిర్మాణం చేసి బియ్యం నిల్వ చేస్తున్నట్లు తెలిసింది.
పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేదల ఆకలి తీర్చడానికి రేషన్ షాప్‌ల ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. కొం దరు వ్యాపారులు, డీలర్లు పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. టన్నుల కొద్ది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకుకు తరలిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో బియ్యా న్ని మంచి ధర పలుకుతుండడంతో జహీరాబాద్ నుంచి సరిహద్దు దాటిస్తున్నారు.
గడిచిన వారం రోజుల్లో 3 లారీలను జహీరాబాద్‌లో అధికారులు పట్టుకుని సీజ్‌చేశారు. జహీరాబాద్, కర్ణాటకకు చెందిన బియ్యం వ్యాపారులు వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని చిన్న చిన్న వాహనాల్లో జహీరాబాద్‌లోని గోదాములకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇస్తేనే దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తున్నారు కానీ, ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాలు, పట్టణాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని అనుమానం రాకుండా వ్యాపారులు గోనె సంచుల్లో కాకుండా ప్లాస్టిక్ సంచుల్లో నింపుతున్నారు. ఒక్కో బ్యాగుల్లో 25 నుంచి 50 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఇలా చేయడంతో తనిఖీల సమయంలో అధికారులు సైతం గుర్తించలేక పోతున్నారు.
సంచుల్లోని బియ్యం బయటకు తీసి పరిశీలిస్తే తప్పు గుర్తుపట్టడం కష్టం. రేషన్ బియ్యం తరలించే సమయంలో వ్యాపారులు ఎవరు ఉండరు. కేవలం లారీడ్రైవర్, క్లీనర్, కూలీలు ఉంటారు. కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించి, మిల్లింగ్ చేసిన తర్వాత నేరుగా బహిరంగా మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు.
గ్రామాల్లో కొందరు ఇంటింటికీ తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీ చేసే సమయంలో వ్యాపారులు కొంతమంది కూలీలను నియమించుకొని ఇంటింటికీ తిరిగి తక్కువ ధరకు ప్రజల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లే లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చి నేరుగా బియ్యం తీసుకుని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాల్లో కిలో బియ్యం రూ.10 నుంచి రూ. 14 చొప్పున బహిరంగంగానే కొనుగోలు చేసి ఆటోల్లో తరలించి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గ్రామాలు,పట్టణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు నిల్వ చేసి రూ. 15 నుంచి 16 వరకు విక్రయిస్తున్నారు. కొం దరు వ్యాపారులు నేరుగా లారీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారు. ఈ రాష్ర్టాల్లో దొడ్డు బియ్యం రూ. 20 నుంచి రూ.30 వరకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.