‘ఉడికి ఉడకని అన్నం.. చప్పటి కూరలు ఈ భోజనం విద్యార్థులు ఎలా తింటారు ? మీ పిల్లలు ఇదే అన్నం తింటారా’ అంటూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలతో పాటు పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే, హరితహారం పనులు సరిగా లేవంటూ ఎంపీవో శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, పంచాయతీ కార్యదర్శి షకీల్‌ను సస్పెండ్ చేశారు. దవాఖానలో నర్సు తప్పా ఎవరూ లేకపోవడంతో విధుల్లోకి రాని వారిపై రిపోర్టు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
కొండాపూర్, జూలై28: మళ్లీ ఎప్పుడంటే అప్పుడే వస్తా.. తీరుమారకుంటే సస్పెండ్ చేస్తా.. అంటు కొండాపూర్‌లోని గిర్మాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సం గారెడ్డి కలెక్టర్ శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో పారిశుధ్యం ఇలాగేనా అంటూ సీరియస్ అయ్యారు. గురువారం కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాల, తహసీల్దార్, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను మొత్తం పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భో జనం చేశారు. ఉడికి ఉడకని అన్నం, సప్పటి కూరలు, ఏ మాత్రం రుచికరంగా లేకుండా ఉండటం ఏంటని మండిపడ్డారు. తరగతి గదులు కూడా శుభ్రంగా లేకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు.
హాస్టల్, పాఠశాలలు అంటే ఇంత చులకనగా అయిపోయాయా..?మీ ఇంట్లో మీ పిల్లలు ఇదే అన్నం తింటారా? ఒక్కసారి ఇలాంటి అన్నాన్ని మీ ఇంట్లోని పిల్లలకు వండి పెడితే తెలుస్తుంది. ప్రభుత్వం హాస్టల్స్, పాఠశాలల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటే, మీరేమో స్థానికంగా ఉండకుండా ఎక్కడో ఒక చోట నివాసం ఉంటూ పిల్లలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీ పిల్లలు ఎంతో, హాస్టల్లో ఉండే పిల్లల కూడా అంతే. వారిని కూడా అలా గే చూసుకోవాలి, లేదంటే కఠినంగా చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. కూరగాయలు భాగలేకపోవడంతో వాటిని సైప్లె చేసే వారికి ఒక్క నెల డబ్బులు ఆపాలంటూ ఆదేశించారు.
కొండాపూర్ మండలంలో హరితహారం పనులు సక్రమంగా లేవంటూ కలెక్టర్ మండిపడ్డారు. రోడ్లకు ఇరు పక్కల ఒక హరితహారం మొక్కల కూడా లేవంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అక్కడక్కడ ఉన్న ఒకటి రెండు మొక్క లు కూడా ఎండిపోవడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో కొండాపూర్ ఎంపీవో శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు.
అలాగే కొండాపూ ర్ పంచాయతీ కార్యదర్శి షకీల్‌ను సస్పెండ్ చేశారు. కొండాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఒక నర్సు తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిజిస్టర్‌ను పరిశీలించి పనివేళలో లేని వారి రిపోర్ట్‌ను రాసి పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ ఉన్నారు.