సిద్దిపేట, జూలై 24: కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్నగర్ ముత్యాలపోచమ్మ, శ్రీనగర్ రేణుకా ఎల్లమ్మ, మోహిన్పుర దీకొండ మైసమ్మ, కాళ్లకుంటకాలనీ మైసమ్మ, నర్సాపురం కేసీఆర్‌నగర్ నల్లపోచమ్మ, సౌడలమ్మ బోనాలు నిర్వహించగా మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..త్వరలోనే శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవార్లకు బోనాల పండుగ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరపడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని, పశుపక్షాదులు, పిల్లాపాపలు సల్లంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు.
టీఆహెచ్ఆర్నగర్ కాలనీలో యూజీడీ, సీసీ రోడ్లు, రేషన్‌షాపు ఏర్పాటు చేయిస్తానన్నారు. దశల వారీగా కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బెజ్జంకి, జూలై 24: మండల కేంద్రంలో పెద్దమ్మ జాతరలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షుడు అక్కరవేని పోశయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.