ఆశాఢమాసం చివరి ఆదివారం బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నేవైద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, పాడిపంటలు కళకళలాడాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నారు.
డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలతో అంతటా సందడి వాతావరణం నెలకొన్నది. వేడుకల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
పెద్దశంకరంపేట, జూలై 24: తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఆదివారం పెద్ద శంకరంపేటలోని రాణిశంకరమ్మ గడీలో గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక (చావిడి) సరస్వతీ శిశుమందిర్ నుంచి మహంకాళీ చిత్రపటాన్ని పట్టణ పురవీధులగుండా గడీలోని బాజాభజంత్రీలతో, డప్పు వాయిద్యాలతో శివసత్తుల నృత్యాలతో, జానపదాల హోరు, గట్టాల ఊరేగింపుతో తీసుకెళ్లారు. అమ్మా.. తల్లీ సల్లంగ చూడమ్మ అంటూ భక్తులు అమ్మ వార్లకు బోనాలను సమర్పించి గడిలో ఉన్న దుర్గామాతకు నైవే ద్యం సమర్పించారు. గడీలోకి భక్తులు, మహిళలు, యువ కులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోట ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
గడీలో ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హాజరయ్యారు. కార్య క్రమం లో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, పట్టణ సర్పంచ్ అలుగుల సత్య నారాయణ, ఎంపీటీసీలు వీణాసుభాశ్గౌడ్, ఉప సర్పంచ్ దశరత్, గడికోట ఉత్సవ కమిటీ బాధ్యులు వేణుగోపాల్‌గౌడ్, రవీందర్, కాపు కృష్ణరెడ్డి, పున్నయ్య, రవివర్మ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మండలంలోని బూర్గుపల్లిలో కోలమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామ పంచాయతీ నుంచి మహిళలు బోనాలతో గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమ ర్పించారు.
రామాయంపేట, జూలై 24: రామాయంపేట పట్టణంతో పాటు కోనాపూర్, డీ ధర్మారం గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. రామాయంపేట పట్టణంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి ఆలయానికి చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సరాఫ్ పాండురంగా చారి చైర్మన్లను శాలువాతో సన్మానించారు. కోనాపూర్‌లోని పోచ మ్మ, దుర్గమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
నిజాంపేట, జూలై24: మండలంలోని నస్కల్లో ఆదివా రం గ్రామస్తులందరూ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామస్తులు లిం గంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎల్లం ఉన్నారు.
కొల్చారం, జూలై 24: కొల్చారంలో గ్రామ దేవతలకు ఆదివారం బోనాల ఊరేగింపు ఘనం గా జరిగింది. అందంగా అలంకరించిన బోనాలను పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలతో గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. గ్రామ దేవతలైన పోచమ్మ, దుర్గమ్మలకు భక్తులు నైవేద్యాలను సమర్పించారు.
మెదక్‌రూరల్, జూలై24: మంబోజిపల్లి శివారులోని కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జునస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడిదిం. ఆదివా రం ఆలయ నిర్వాహకులు పూ జారి మల్లన్న ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి ఉద యం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేణుకామాతకు బోనాలు సమర్పించారు. మంగళ హారతులతో ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
శివ్వంపేట, జులై 24 : మం డలంలోని ఏదుల్లాపూర్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నల్లపోచమ్మతల్లి అమ్మవారికి సర్పం చ్ కల్లూరి కీర్తనాహనుమంతరావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమా రం, శివ్వంపేట, గూడూరు గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
నర్సాపూర్, జూలై24: నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రా మాల్లో బోనాల ఉత్సవాలు ఘ నంగా జరిగాయి. మున్సిపాలిటీలోని ముత్యాలమ్మ అమ్మవారికి మహిళలు బోనా లు సమర్పించారు. ఎడ్లబండ్లను ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి, మహ్మద్‌నగర్ గ్రా మాల్లో అమ్మవారికి మహిళలు బోనలను సమర్పించారు.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 24: జిల్లా కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బో నాలను వైభవంగా నిర్వహించా రు. ఊరేగింపు పట్టణంలోని పెద్దబజార్, శివ్వబెల్లయ్య చౌరస్తా, రాందాస్‌చౌరస్తా, పాత బస్టాండ్ల మీదుగా అరబ్గల్లీలోని కాళీమా తా ఆలయానికి చేరుకుని కాళీమాతకు బోనాలను సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో స్వర్ణకార సంఘం ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌలి, చికోడ్ నాగరాజు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
తూప్రాన్/మనోహరాబాద్, జూలై 24: తూప్రాన్, మనోహరాబాద్ మండలల్లోని పలు గ్రామాల్లో బోనాల జాతరను ఘ నంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, ఆడ పడుచుల బోనాలతో సందడి వాతావరణం చోటు చేసుకుంది.
తూప్రాన్, జూలై 24 : తెలంగాణ వచ్చాకే గ్రామాల్లో బోనాల జాతరలు, పండుగలను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల జాతరోత్సవాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
చేగుంట, జూలై 24: చేగుంట, నార్సింగి మండలల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సొసైటీ చైర్మన్ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
