సిద్దిపేట, జూలై 24: ‘భవన నిర్మాణ కార్మికులు పట్టణ, నగర అభివృద్ధికి పునాదిరాళ్లు.. ఇంజినీర్లు సైతం చేయలేనివి అనుభవంతో పనిచేసే నేర్పరితనం భవన నిర్మాణ కార్మికుల సొంతం. సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో కార్మికులంతా భాగస్వాములే..’ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని కొండాభూదేవి గార్డెన్లో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణం వెనుక భవన నిర్మాణ కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు.
సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక బీమా రూ.3 లక్షలు ఉంటే, సీఎం కేసీఆర్ దానిని రూ.6 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కార్మికుడు సాధారణంగా చనిపోతే గతంలో రూ.30 వేలు ఆర్థిక సాయం చెల్లిస్తే, దానిని రూ.లక్షా 30లకు ప్రభుత్వం పెంచిందన్నారు. సభ్యత్వం కలిగిన కార్మికుడి కుటుంబంలో పెండ్లికి రూ.30 వేలు, భవన నిర్మాణ కార్మికుల ప్రసూతి ఖర్చులకు రూ.30 వేలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో శిక్షణ పొందిన కార్మికులకు పనిలో మెలకువలు, నైపుణ్యత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఏటా 300 మందికి శిక్షణ ఇవ్వనున్నామని, రూ.5 కోట్లతో దీనిని ప్రారంభించనున్నామన్నారు.
కార్మికుల కోరిక న్యాక్ సెంటర్‌ను సిద్దిపేటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు మొదటి విడుతగా లక్ష మందికి సబ్సిడీ ద్వారా మోటరు సైకిళ్లు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం, వెసులుబాటు కోరుతూ క్యాం పు కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పీఏను ఏర్పా టు చేసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కార్మిక బీమా కోసం ప్రతి కార్మికుడికి రూ.110 ప్రీమి యం తానే స్వయంగా చెల్లిస్తానని తెలిపారు. తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.30 లక్షలు వెచ్చించి భవన నిర్మాణ కార్మికులకు శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కార్మిక బోర్డులో సభ్యులుగా ఉన్న కార్మికులు వైకల్యం పొందితే రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. న్యాక్ సెంటర్లో 5వేల మంది కార్మికులు శిక్షణ పొందితే ప్రతిరోజు రూ.300 ైస్టెఫండ్ ఇచ్చి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎల్అండ్టీ కంపెనీ ఐదు విభాగాల్లో కార్మికులకు మెలకువలు నేర్పి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదన్నారు.
కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం, కార్యదర్శి సారంగపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సెంట్రింగ్ సంఘం అధ్యక్షుడు నర్ర రవీందర్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్, పరుశరాములు, సాయన్నగారి శ్రీనివాస్, నర్సింలు, ప్రశాంత్, మల్లేశం, రాము లు, కనకయ్య, ఆయా జిల్లాల, మండలాల కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.