చేర్యాల, జూలై 23 : తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి కేటీఆర్ పేరు తెచ్చుకున్నారని, తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయం పై పోరాటం చేస్తున్నాడని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని ముస్త్యాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రతిపక్ష బీజేపీలో మంత్రి కేటీఆర్ చలిపుట్టిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సదరు ఎంపీల వద్ద సమాధానం లేదన్నారు. పరిశ్రమలశాఖ మంత్రిగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చి, దేశంలో ఏ రాష్ర్టానికి రాని విధంగా తెలంగాణకు పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రిగా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నాడని, ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించే తీరు హర్షణీయమన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చేర్యాలలో 18వేలు, కొమురవెల్లిలో 12, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 14వేల చొప్పున మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.అధికారులు, సిబ్బందితో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ మల్లేశం, మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బండోజు భాస్కరాచారి, యూత్ మండల అధ్యక్షుడు ఆకుల రాజేశ్, తాటికొండ సదానందం,ఎంపీడీవో సయ్యద్ తారీఖ్అన్వర్,ఎంపీవో అలీ, ఏపీవో మంజుల పాల్గొన్నారు. రైతుబంధు మండల కోఆర్డినేటర్ తాడెం రంజితాకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు.