సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, ప్రశాంత్‌నగర్, సిద్దిపేట రూరల్, గజ్వేల్, కొమురవెల్లి, మిర్దొడ్డి, నారాయణరావుపేట, నంగునూరు, హుస్నాబాద్ టౌన్, రాయపోల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కురిశాయి. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయి. ఆయా గ్రామాల వాగుల్లో నిర్మించిన చెక్‌డ్యామ్‌లకు జళకళ సంతరించుకోవడంతోపాటు అలుగుపారుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చేర్యాల మండలంలో 82.6, కొమురవెల్లిలో 86.8, మద్దూరులో 126.2, ధూళిమిట్టలో 69.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చేర్యాల మండలంలోని వేచరేణి, గుర్జకుంట, దొమ్మాట, చిట్యాల, ఆకునూరు వాగులు ప్రవహిస్తున్నాయి. కడవేర్గు చెరువు మత్తడి పడుతుండడంతో నాగపురి, పెదరాజుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చేర్యాల-దానపంల్లి రహదారిలోని తాడూరు లోలెవల్ బ్రిడ్జ్ రోడ్డుపై వరద ప్రవహిస్తుండడంతో చిట్యాల, తాడూరు, దానంపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేచరేణి వాగులో చెక్‌డ్యాం మత్తడి పోస్తున్నది. మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది చేర్యాల గాంధీ చౌక్ ఏరియాలో నీరు నిలవడంతో వాటిని తొలిగించారు.
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని అన్ని వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు, చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కోహెడ మండలం బస్వాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా హుస్నాబాద్‌లోని కొత్త చెరువు, పల్లె చెరువులు మత్తడి పోస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో వర్షాలతో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
సిద్దిపేటలోని పర్యాటక కేంద్రమైన కోమటి చెరువు నిండి మత్తడి దుంకుతుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట కాముని చెరువు, పోసానిపల్లి గుండ్ల చెరువు మత్తడి దుంకుతున్నాయి. మిరుదొడ్డి వద్ద కూడవెల్లి పురాతన బ్రిడ్జికి ఆనుకొని నూతన హైలెవల్ బ్రిడ్జి నుంచి దిగువనకు ఉధృతంగా వరద ప్రవహిస్తున్నది.