సంగారెడ్డి, న్యూస్‌నెట్‌వర్క్ జూలై 23 : జిల్లాలో దంచికొట్టిన వానకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు నీటిమట్టం పూర్తిగా నిండుకొని అలుగు పారుతుంది. శుక్రవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కంది మండల పరిధిలోని కిసాన్ సాగర్‌ను సందర్శించి పరిశీలించారు. కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారుతుండటంతో కల్హేర్-పిట్లం మధ్యలో ఉన్న మహారాజ్ వాగు వంతెనపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది.
దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. న్యాల్కల్ మండలంలోని రేజింతల్, చాల్కి, హుస్సేనగర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో వర్షానికి దాదాపు రెండు వందల ఎకరాల్లో పత్తి, సోయాబీన్, మినుము, పేసర పంటలు దెబ్బతిన్నాయని మండల వ్యవసాయాధికారి లావణ్య పరిశీలించారు.
కోహీర్ మండలంలోని నారింజ వాగు పక్కన ఉన్న పంట పొలా లు నీట మునిగాయి. సిర్గాపూర్ మండలంలోని వాసర్, పోట్పల్లి, వంగ్ధాల్, గర్డెగాం, ముబారకపూర్, సిర్గాపూర్ తదితర గ్రామాల్లోని వాగు పరివాహక ప్రాంతా ల్లో వరద ఉధృతికి పంటలు నీట మునిగాయి. అమీన్పూర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలంలోని గండిగూడెం తదితర గ్రామాల్లో సందర్శించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
