జిన్నారం20.2
అందోలు15.1
హత్నూర14.5
మనూరు13.7
వట్పల్లి13.4
నాగల్గిద్ద13.1
అమీన్పూర్12.4
నారాయణఖేడ్12.8
కల్హేర్12.8
సిర్గాపూర్10.2
పుల్కల్10.1
అలుగుపారినచెరువులు218
నిండిన చెరువులు265
75 % నిండిన చెరువులు1150
50 % నిండిన చెరువులు1000
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలు తడిసిముద్దయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. సింగూరు, మంజీరా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జలాలు దిగువకు పరుగులెత్తుతున్నాయి. నారింజ, నల్లవాగు,ఘనపూర్ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 16.7సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వంతెనలపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో పంటలు నీటమునగగా, శిథిలావస్థలో ఉన్న కొన్ని ఇండ్లు కూలిపోయాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు.
ప్రాణ, ఆస్తినష్టం జరగుకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో గణేశ్ మినరల్ పరిశ్రమలో గోడ కూలి బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వనదుర్గామాత ఆలయం వద్ద మెదక్ కలెక్టర్ హరీశ్, సింగూరు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి పరిశీలించారు.
అల్పపీడనం కారణంగా శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షం మెదక్, సంగారెడ్డి జిల్లాలను జలదిగ్బంధం చేసింది. రెండు జిల్లాల్లోని ఆయా మండలాల్లో కుండపోత వర్షం కురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, జలవనరుల్లో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్నది.
ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా అధికారులు సింగూరు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మెదక్ ఘనపూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద రాగా, ఏడుపాయల దేవాలయాన్ని మూసిన ఆలయ సిబ్బంది, అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. సమస్యలు ఉన్నచోట్లను తనిఖీలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
– మెదక్/ సంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ):మెదక్, సంగారెడ్డి జిల్లాలను మరోమారు వరుణుడు ముంచెత్తాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జల్లులతో మొదలైన వర్షం సాయంత్రానికి ఉగ్రరూపం దాల్చాడు. శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది.
దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 167.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగటంతో శనివారం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదిలారు. మంజీరా బ్యారేజీ నిండటంతో ఐదుగేట్ల నుంచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో మంజీరా నది నిండుగా ప్రవహిస్తోంది.
వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ శరత్ శనివారం మధ్యాహ్నం సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. సింగూరుకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి మండలంలోని మహబూబ్‌సాగర్, కంది మండలంలోని దేవునిచెరువులను ఆయన సందర్శించారు.
జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్‌నగర్ కాలనీ, రషీద్ కాలనీ, ఆటో నగర్లలో పెద్ద ఎత్తున వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని గంగనేని థియేటర్ వద్ద నుంచి వెల్కం బోర్డు చౌరస్తా వరకు ఉన్న రోడ్డు చెరువును తలపించింది.
ఆయా కాలనీల్లోని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో పాత ఇండ్లు కూలిపోవడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది వారిని వేరే ప్రాంతాలకు తరలించారు.
డ్రైనేజీలు లేనిచోట్ల మురుగు నీరంతా రోడ్లపైకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రంతా కురిసిన వర్షానికి చమన్‌తో పాటు వెంకట్రావ్‌నగర్ కాలనీల్లో వరదలు ప్రవహిస్తుండడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మున్సిపల్ అధికారులతో కలిసి వరద నీటిని వేరే ప్రాంతాలకు మళ్లించారు.
సంగారెడ్డి జిల్లాలో వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు అలుగెల్లుతున్నాయి. న్యాల్కల్ మండలం రేజింతల్ వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రేజింతల్-ఎల్గోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతుండగా, ఉజలంపాడ్ చెరువు మత్తడి దుంకుతున్నది.
కల్హేర్-కామారెడ్డి జిల్లాలోని పిట్లం గ్రామాల మధ్య ఉన్న మహారాజు వాగు పొంగిప్రవహించటంతో రెండు మండలాల మధ్య ఉన్న బ్రిడ్జి నీట మునిగి, రాకపోకలు నిలిచిపోయాయి. మాసాన్‌పల్లి వాగు పొంగిప్రవహించగా గ్రామంలోని 15 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని అలక చెరువు అలుగుపారింది.
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్సాగర్చెరువు అలుగెల్లుతున్నది. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని పెద్దచెరువు నిండి అలుగు పారింది. రాయికోడ్ మండలంలోని కుసునూరులోని గుర్మిల్ల వాగు ప్రాజెక్టు, సింగీతం గ్రామంలోని హన్మండ్ల వాగు ప్రాజెక్టు, జమ్గి(కె)లోని మత్తడి దుంకుతున్నాయి. జిన్నారం మండలంలోని వావిలాల చెరువు, ఊట్ల పెద్దచెరువు, తెల్లాపూర్‌లోని వనంచెరువు అలుగు పారాయి. బొల్లారంలోని వైఎస్ఆర్ కాలనీలోకి వర్షం నీళ్లు చేరటంతో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. అమీన్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండాయి.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జిన్నారం, అమీన్పూర్, బొల్లారంలో పర్యటించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వట్పల్లి, జహీరాబాద్, న్యాల్కల్, నారాయణఖేడ్ మండలాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ అధికారులు పంటపొలాలను సందర్శించి పంటనష్టం అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 34వేల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు 9, 10, 11 గేట్లను రెండు మీటర్లు ఎత్తి దిగువకు వరద జలాలను వదిలారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి 34,890 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు గేట్ల ఎత్తటంతో మంజీరా రిజర్వాయర్ నిండింది. ఈ రిజర్వాయర్ ఐదు గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదులుతున్నారు. దీంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. సింగూరు ప్రాజెక్టు వరద నీరు వస్తుండటంతో జెన్కో రెండు టర్బైన్ల ద్వారా 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది.
జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) లోని నారింజ ప్రాజెక్టు నిండింది. వర్షాల కారణంగా వరద రావటంతో నారింజ వాగు పూర్తిగా నిండింది. వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తున్నది. పోచారం డ్యాం ఇప్పటికే నిండగా, ఈ వర్షంతో మరింత వరద ప్రవాహం వస్తోంది. మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది.
జహీరాబాద్, జూలై 23: జహీరాబాద్ పట్టణంతోపాటు మండలంలో భారీ వర్షం కురవడంతో నారింజ వాగు పరుగులు తీస్తున్నది. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో కురిసిన భారీవర్షాలకు నారింజ ప్రాజెక్టు నిండిపోయింది. నారింజ ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద ప్రవహిస్తున్నది. వరద కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నది. చెరువులు, చెక్‌డ్యాంలు, ఊట చెరువులోకి వరద చేరుతున్నది.
కొల్చారం/ పాపన్నపేట, జూలై 23: ఇటీవల కురిసిన వర్షాలతో ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతున్నది. దీనికి తోడు సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు గేట్లను ఎత్తడంతో ఏడుపాయల వనదుర్గా అమ్మవారి ఆలయం ఎదుట నుంచి నిజాంసాగర్ వైపు పరుగులు తీస్తున్నది. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి ఆలయాన్ని మూసివేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆలయం ఎదుట ప్రవహిస్తున్న గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు.
సిర్గాపూర్, జూలై 23 : సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి 16,938 క్యూసెక్కుల వరద వచ్చిందని శనివారం ఏఈ సూర్యకాంత్ తెలిపారు. వరదతో రెండున్నర ఫీట్ల ఎత్తులో అలుగు దుంకుతున్నది. అలుగు దిగువ మార్గమధ్యలో రహదారి వంతెనకు వరదనీరు తాకి ప్రవహించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 1493 అడుగులు కాగా, 149.50 అడుగుల నీటి మట్టానికి చేరింది. దీంతో అలుగు ద్వారా 16,838 క్యూసెక్కులు దిగువకు ఉరకలేస్తుండగా, కుడి, ఎడమ కాల్వల ద్వారా 100 క్యూసెక్కులు నీటిని అధికారులు వదిలారు.