పుల్కల్, జూలై 23 : 15 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరుకు వరద చేరుతున్నది. నీటిపారుదల శాఖ అధికారులు నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం మరింతగా ప్రాజెక్టులోకి కొనసాగడంతో అధికారులు శనివారం 9,10,11 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వేర్వేరుగా ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టులోకి భారీఎత్తున వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నీటి హెచ్చు, తగ్గులను గమనిస్తూ ఉండాలని అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు.34.890 క్యూసెక్యుల నీరు వరదరూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా, అవుట్‌ఫ్లో 34.890 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నట్లు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.
సింగూరు ప్రాజెక్టు సమీపంలోని ఉన్న పార్కు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. కొన్నేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోని 9 గేట్లను ఎత్తి వేయడంతో నీటి ప్రవాహానికి పార్కు పాడై సందర్శికుల తాకిడి తగ్గిందని చెప్పారు.
అధికారులతో కలిసి పార్కును పరిశీలించి ఎమ్మెల్యే ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పార్కును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఎమ్మెల్యే వెంట జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ నర్సింహారెడ్డి, తహసీల్దార్ పరమేశం, ఇరిగేషన్ ఏఈ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ రాజాగౌడ్, ఎంపీటీసీ అవుసలి శ్రీనివాసచారి, నాయకులు సంగమేశ్వర్‌గౌడ్, మధుసూదన్, వీరారెడ్డి, విష్ణయ్య, రాజు, అధికారులు ఉన్నారు.