మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలు జలమయ్యాయని, పంట, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్‌నగర్, సాయినగర్, ఆటోనగర్ కాలనీలు నీట మునిగాయి. శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆయా కాలనీల్లో పర్యటించారు. గంగినేని థియేటర్ నుంచి వెల్కంబోర్డు వరకు ఉన్న రోడ్లన్నీ చెరువులను తలపించడంతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాహనదారులతో పాటు పాదచారులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలతో వాగులు, చెరువుల్లో వరద చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నదని, ప్రజలు ఎవ్వరూ కూడా చెరువులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. గంగాపూర్, శమ్నాపూర్ గ్రామాల మధ్య ఉన్న రైల్వే స్టేషన్ వద్ద వరద భారీగా చేరుకోవడంతో మున్సిపల్ ట్రాక్టర్ మునిగిపోయిందని గుర్తుచేశారు.
మెదక్ మండలం, హవేళీఘనపూర్ మండలం, పాపన్నపేట మండలాల్లో పర్యటించి వర్షానికి కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. భారీ వర్షానికి మునిగిపోయిన పంటలను పరిశీలించారు. పంట, ఆస్తి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చె ప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉం డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
మెదక్ పట్టణంలోని వెంకట్రావ్‌నగర్, సాయినగర్, ఆటోనగర్‌లో రోడ్లన్నీ జలమయం కాగా, ఎమ్మెల్యే జేసీబీ వాహనంపై పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నీటి ప్రవాహంతో ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే నీరు నిల్వ ఉన్న చోట జేసీబీతో కాల్వను తీయించారు. ఆటోనగర్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తొలి గించి రోడ్డుపై నుంచి నీరు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.
కాలనీల్లో నీరు నిల్వ ఉన్న చోట మోటర్ల సహాయంతో బయటకు పంపింగ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు సమీయొద్దీన్, సులోచనాప్రభురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.