మెదక్ జిల్లా నెట్వర్క్, జూలై 23 : జిల్లావ్యాప్తంగా శుక్ర వారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులు,చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని వాగులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. పంటలు నీట మునిగాయి. గ్రామాల్లో పాత ఇండ్లు కూలాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
మెదక్ మండలంలోని బొల్లారం, ర్యాలామడుగు ప్రాజెక్టు లు మత్తడి దుంకుతున్నాయి. పాతూర్, కొంటూర్ చెరువు నిండాయి. రాయిన్‌పల్లి ప్రాజెక్టు జిల్లాలోనే అతి పెద్దది 282 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్ )సామర్థం ఉన్న రాయి న్‌పల్లి చెరువు పొంగిపొర్లుతున్నది.
మాల్కాపూర్‌లో చెరువులు తెగిపోవడంతో తాడు సాయంతో ప్రజలు రాకపోకలు సాగించారు. పెద్దశంకరంపేట మండలంలో తిర్మలాపురం, బుజ్రాన్‌పల్లి, టెంకటి, రామోజీపల్లి, బద్దారం, మూసాపేట, కమలాపురం, జంబికుంట, ఆరెపల్లి గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. చిన్నశంకరంపేట మండలంలో కూలిన ఇండ్లు, దెబ్బతిన్న రోడ్లను అధికారులు పరిశీలించారు.
టేక్మాల్ మండలంలో గుండువాగు పొంగిపొర్లుతున్నది. టేక్మాల్ – జోగిపేట్ రోడ్డులో రాకపోకలు నిలిచాయి. అల్లాదుర్గం మండలంలో 117 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లాదుర్గంలోని బట్టికుంట నిందింది. ముప్పారంలోని వెంకటేశ్వరకుంటకు గండి పడింది.
– రామాయంపేట మండలంలో 14సెంటీమీటర్లు
రామాయంపేటలోని మల్లెచెరువు పొంగిపొర్లుతున్నది. పట్టణంలోని తహసీల్ కార్యాలయం, బాలికల వసతి గృహం, మంజీరా కాలనీ, ప్రభుత్వ కళాశాల ఆవరణలో నీళ్లు నిలిచిపోయాయి. ఝాన్సీలింగాపూర్లోని పెద్ద చెరువు నిండడంతో గ్రా మస్తులు పూజలు చేశారు. బాపనయ్యతండాలోని పుష్పాల వాగు అలుగు పారుతున్నది. రాయిలాపూర్, ధర్మారం (డీ), కోనాపూర్ గ్రామాల్లో పాత ఇండ్లు కూలాయి.
చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు, పాత ఇండ్లు కూలాయి. కర్నాల్‌పల్లి గ్రామంలో వరదనీటిలో పెద్దపెద్ద చెపలు కొట్టుకు వచ్చాయి. వల్లభాపూర్ జాతీయ రహదారిపైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నిలిచాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన తోకల సాయిలు అనే యువకుడు హైదరాబాద్‌కు బైక్ పై వెళ్తూ డివైడర్‌కు ఢీకొని మృతి చెందాడు. చేగుంటలోని చెరువుల్లో సర్పంచ్ శ్రీనివాస్ పూజలు చేశారు. ఇబ్రహీంపూర్ పటేల్‌కుంట కట్ట తెగిపోయింది. జెప్తిశివునూర్, భీంరావ్పల్లి, వడియారం గ్రామాల్లో చెరువులు మత్తడులు దుంకుతున్నాయి. నిజాంపేట మండలం నార్లపూర్‌లో ఇండ్లలోకి నీళ్లు వచ్చా యి. వివిధ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.
తూప్రాన్ మండలవ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆబోతుపల్లి, కిష్టాపూర్‌లో హల్దీవాగుపై వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లడంతో వెంకటరత్నాపూర్, కిష్టాపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లి తదితర గ్రామాల నుంచిడి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు గుండ్రెడ్డిపల్లి, దాతర్పల్లి, ఇస్లాంపూర్, మాసాయిపేట, నాచారం మీదుగా తూప్రాన్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. రామాయిపల్లిలో జాతీయ రహదారిపై నిర్మించిన రైల్వే అండర్ పాస్‌లోకి భారీగా నీరు చేరడంతో మోటర్ల ద్వారా నీటిని బయటికి పంపించారు. 44వ జాతీయ రహదారిపై నర్సాపూర్ చౌర స్తా బైపాస్ వద్ద, కరీంగూడ బైపాస్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. మండలంలో 28 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తూప్రాన్ ఆర్ఐ నగేశ్ తెలిపారు.
నర్సాపూర్ పట్టణంలోని రాయారావు, అచ్చంపేట్‌లోని చెరువులు అలుగుపారుతున్నాయి. శివ్వంపేట మండలంలోని ఎదుల్లాపూర్ చెరువు అలుగుపారడంతో రాకపోకలు నిలి చా యి. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్, చండూర్, గౌతాపూర్, అజ్జమర్రి, సోమక్కపేట గ్రామాల్లో చెరువులు నిండాయి.
ఉమ్మడి వెల్దుర్తి మండలవ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యాంలు పొంగిప్రవహిస్తున్నాయి. మాసాయిపేట మండలంలోని హల్దీ ప్రాజెక్టు మత్తడి దూకుతుండడంతో దిగువన ఉన్న చెక్‌డ్యాంలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారి ఉప్పులింగాపూర్ శివారులో రాకపోకలు నిలిచాయి. శెట్పల్లి, రామాయిపల్లి గ్రామాల మధ్యన, వెల్దుర్తి-యశ్వంతరావుపేట రోడ్డుపై ఎలుకపల్లిలో కుమ్మరివాగు ప్రవాహానికి మట్టిరోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మాసాయిపేట మండలం రామంతాపూర్తండాకు వెళ్లే రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా వర ద, మట్టి చేరడంతో జేసీబీ సాయంతో మట్టిని తొలిగించారు. శేరీల కట్టుకాలువను శుభ్రం చేశారు. చర్లపల్లిలో గ్రామానికి చెం దిన మల్లారెడ్డి, ధర్మారంలో రైతు దుర్గయ్యకు చెందిన కోళ్ల ఫారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇండ్లు, గుడిసెలు దెబ్బతినగా అధికారులు వివరాలను నమోదు చేస్తున్నారు.
చిలిపిచెడ్/ కొల్చారం/ రామాయంపేట రూరల్/ పెద్దశంకరంపేట, జూలై 23 : చిలిపిచెడ్ మండలంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతాలైన గంగారం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్ గ్రామాల్లో తహసీల్దార్ కమాలాద్రి పర్యటించారు. గ్రామాల్లో నీట మునిగిన వరి, పత్తి పంట లను ఆర్ఐ నాగరాజుతో కలిసి పరిశీలించారు. చండూర్, చిట్కుల్ గ్రామాల్లో ఇండ్లు కూలాయి. కొల్చారం మండల వ్యాప్తంగా పంట పొలాల్లో ఇసుక మెటలు వేశాయి.
సుమారుగా 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఏవో శ్వేతకుమారి తెలిపారు. మండలవ్యాప్తంగా 50 ఇళ్లు కూలినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు తెలిపారు. పెద్దశంకరంపేట మండలంలో సుమారు 20 ఇండ్లు కూలిపోయాయి. వారం రోజుల క్రితం 50 ఇండ్లు కూలిపోగా, వాటి సంఖ్య 70కి చేరినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నిజాం సాగర్‌కు ఆనుకొని ఉన్న ఆయా గ్రామాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో ఓ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది.