నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా నిజాంపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీంతో తమ చిరకాల స్వప్నం నెరవేరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
నారాయణఖేడ్, జూలై 23 : నిజాంపేట్ గ్రామస్తుల కల నిజమైంది. నారాయణఖేడ్ నియోజకవ ర్గంలోని నిజాంపేట్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణఖేడ్ మండలంలో జనాభా పరంగా పెద్ద గ్రామమైన నిజాంపేట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా నిజాంపేట్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చొరవ మంత్రి హరీశ్‌రావు సహకారంతో గ్రామస్తుల ఆకాంక్షను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో మండలానికి అడుగు పడిందని చెప్పవచ్చు. గత ఫిబ్రవరి 21న బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నారాయణఖేడ్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ నిజాంపేట్ మండలాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ సాకారమైంది. నిజాంపేట్ కేం ద్రంగా 9 గ్రామాలు, 6 తండాలు కొత్త మండలం పరిధిలోకి రానున్నాయి.
నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్, కొత్తపల్లి, మేగ్యానాయక్ తండా, ర్యాలమడుగు, ఈదుల్‌తండా, మాణిక్‌నాయక్ తండా, కల్హేర్ మండలంలోని బాచేపల్లి, బల్కంచెల్క తండా, రాంరెడ్డిపేట్, దామరచెరువు, మునిగేపల్లి, నాగధర్, రాంచందర్ తండా, మంట్రన్కుంట తండా, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పెద్దశంకరంపేట్ మండలంలోని జంబికుంట గ్రామాలు ఇక మీదట నిజాంపేట్ మండల పరిధిలోకి వస్తాయి.
నిజాంపేట్ కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు జరుపుకొన్నారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని గ్రామానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున సన్మానం చేశారు. అనంతరం సర్పంచ్ జగదీశ్వర్‌చారి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
నిజాంపేట్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తూ కొత్త మండలాన్ని ఏర్పా టు చేసిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌కు కృతజ్ఞతలు. నిజాంపేట్తోపాటు ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు కొత్త మండలం ఏర్పాటు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి మండలంగా ఏర్పా టు చేయడం సీఎం కేసీఆర్ మరోసారి గొప్ప మనస్సును చాటారు. మం త్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్ మండల ఏర్పాటు కోసం ప్రత్యేక చొరువ చూపడం సంతోషంగా ఉంది.
మహారెడ్డి భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్యే, నారాయణఖేడ్
నిజాంపేట్ కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌ను మరువబోం. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మండ లంలోని 15 గ్రామాలు విలీనం కానున్నా యి. కల్హేర్ మండలంలోని 7 ఎంపీటీసీ స్థా నాలు నిజాంపేట్ మండలంలోకి వస్తాయి. మండలంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్‌రావు, కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
జగదీశ్వర్‌చారి, నిజాంపేట్, సర్పంచ్