జిన్నారం, జూలై 3: జిన్నారం శివారులోని లక్ష్మీపతిగూడెం బ్రిడ్జి వద్ద ఒకరిని హత్య చేసి, దహనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని నామరూపాలు లేకుండా పెట్రోల్ పోసి దహనం చేసే ప్రయత్నం చేసినట్లు సగం కాలిన మృతదేహాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది. ఆదివారం ఉదయం కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ తన సిబ్బందితో కలిసి జిన్నారం పోలీసులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కాలిన మృతదేహం కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నారాయణరెడ్డిదిగా గుర్తించారు. అనంతరం దీనికి సంబందించిన వివరాలను కేపీహెచ్‌బీ సీఐ ఘటనా స్థలంలోనే మీడియాకు వివరించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు రోడ్ నంబర్ ఒకటిలో నివాసం ఉండే నారాయణరెడ్డి(25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నారాయణరెడ్డి జూన్ 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని బావ 30న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
నారాయణరెడ్డి ఏడాది క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లిని అంగీకరించని యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. నారాయణరెడ్డిని కూడా మందలించారు. అయినా వీరి మధ్య ఫోన్ సంభాషణలు నడుస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆగ్రహం తో ఉన్నట్లు తెలిసిందని సీఐ తెలిపారు. నారాయణరెడ్డి అదృశ్యం అయిన నేపథ్యంలో అనుమానుతులను విచారించగా జిన్నారం పరిసర ప్రాంతంలో నారాయణరెడ్డిని హత్య చేసినట్లు తెలిసిందన్నారు.
జూన్ 27న రాత్రి నారాయణరెడ్డితో అమ్మాయి తరఫు బంధువులు కొందరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో మద్యం సేవించారని, అదే రోజు రాత్రి గొంతు నులిమి హత్య చేశారని సీఐ తెలిపారు. అక్కడి నుంచి జిన్నారం శివారులోని లక్ష్మీపతిగూ డెం బ్రిడ్జి కింద చెట్లల్లో మృత దేహాన్ని పడేసి పెట్రోలు పోసి దహ నం చేశారు. మృతదేహం సగం కాలడంతో పాటు హత్య జరిగి ఆరు రోజులు గడుస్తుండడంతో దుర్వాసన వస్తున్నది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, నారాయణరెడ్డిదిగా గుర్తించారు. మృతదేహానికి అక్కడే పంచనా మా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.