మెదక్ మున్సిపాలిటి, జూలై 3: ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగు భాషలోనే పాఠ్యపుస్తకాలు ఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలను ప్రచురించింది. ఇప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఒకే సారి ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవడం కష్టంగా భావించి అభ్యసన సులువు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పుస్తకాల్లో ఓ వైపు ఇంగ్లిష్ మరో వైపు తెలుగు పాఠం ఉండే విధంగా ప్రభుత్వం ముద్రించింది. రెండు భాషల్లో పాఠాలు ఉండటం వల్ల పేజీల సంఖ్య పెరుగుతుండడంతో రెండు భాగాలుగా విభజించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన కోసం మార్చి, ఏప్రిల్‌లో ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రాల్లో నిపుణులైన బృందంచే శిక్షణ ఇప్పించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇంగ్లిష్ మాధ్యమంపై మరింత విశ్వాసం పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు ఈ విద్య సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం చదువు అందుబాటులోకి రానున్నది. ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ద్విభాషలో ఈ సంవత్సరం ముద్రణ చేపట్టింది. ఒక వైపు తెలుగు మరో వైపు ఇంగ్లిష్‌లో పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ అధికారులు ముద్రించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులపై అధికభారం పడకూడదనే ఉద్దేశంతో గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.
వీటితో గ్రామాల్లో డ్రాపౌట్ సంఖ్య చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద మధ్య తరగతి బాలికలకు గురుకులాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1062 పాఠశాలల్లో ప్రాథమిక 637, ప్రాథమికోన్నత 183, జిల్లా పరిషత్ 242 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 1,26,151వేల వరకు విద్యార్థులు ఉన్నారు. 313పాఠశాలలను మొదటి విడతలో ‘మన ఊరు-మనబడి’లో ఎంపిక చేశారు. వీటిలో అదనపు తరగతి గదులు, మరమ్మతు పనులు, తాగునీరు, విద్యుత్, డైనింగ్ హాల్, కిచెన్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్య సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరగనున్నది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత నమ్మకం కలిగింది.
– రాజయ్య