‘నేను వెళ్లనంటే.. వెళ్లను. నా ఫ్రెండ్స్ ఎవరూ లేరక్కడ’ అంటూ మారాం చేస్తూ.. కండ్ల నిండా నీళ్లు నింపుకొంటున్న పిల్లలను బుజ్జగించేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు లెక్కేలేదు. అయితే, ముందుగా స్కూల్ అంటే పిల్లలకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తున్నారు. పిల్లలు మారాం చేస్తున్నప్పటికీ వారికి సర్ది చెప్పి.. స్కూల్ అంటే ఆసక్తి పెరిగేలా మాట్లాడాలని సూచిస్తున్నారు.
పిల్లల భావోద్వేగాలను తెలుసుకోవాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వారికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. పిల్లలు మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించండి. అప్పుడే వారు ఎందుకు అలా ఏడుస్తున్నారో లేదా ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఎందుకు ఉంటున్నారో తెలుస్తుంది. స్కూల్‌కు వెళ్లినప్పటి నుంచి బయట అడుగు పెట్టేవరకు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. పిల్లల నోటితోనే అన్ని విషయాలు చెప్పించాలి. అప్పుడే వారి ప్రవర్తన మారేలా మనం నడుచుకునేందుకు అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు పాఠశాల గురించి ఎప్పుడూ సానుకూలంగానే మాట్లాడుతుండాలి. ‘వెళ్తే ఇలాంటి స్కూల్‌కు వెళ్లాలి’ అని ప్రోత్సహించేలా చర్చ పెడుతుండాలి. అందుకు గల కారణాలను వివరిస్తుండాలి. స్కూల్లో కల్పిస్తున్న వసతులు, పిల్లలపై ప్రత్యేకంగా పెడుతున్న శ్రద్ధ, పిల్లలు ఆడుకునేందుకు, చదువుకునేందుకు ఉన్న ప్రత్యేక వాతావరణం గురించి మాట్లాడాలి. ఆ స్కూల్లో చదివి ఉన్నతస్థాయికి చేరిన విద్యార్థుల గురించి పిల్లల ముందు మాట్లాడాలి. అప్పుడు పిల్లలు బడికి వెళ్లేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది.
పిల్లల వద్ద తల్లిదండ్రులు ఏదో ప్రత్యేకత చాటాలి. తెచ్చే స్కూల్ బ్యాగ్ కానివ్వండి, కొనిచ్చే టిఫిన్ బాక్స్ లేదా ఇంకేదైనా సరే వారికి కొత్తగా ఉండేలా ప్లాన్ చేయాలి. ఈ వస్తువులు వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. లంచ్ లేదా స్నాక్స్ కోసం మీరు పెట్టే తినుబండారాలు పిల్లలను ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడే కనీసం వాటిపై ఆసక్తితోనైనా పిల్లలు బడికి వెళ్లేందుకు ఇష్టపడొచ్చు. తరగతి గదిలో ఏ యాక్టివిటీపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారో తెలుసుకోవాలి. దాని గురించే చర్చిస్తూ.. క్లాస్‌కు వెళ్లేలా ఆసక్తి పెంచాలి.
పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఇతరుల కంటే ముందే అక్కడ ఉండండి. అందరికంటే ముందు మీరు కనిపిస్తే పిల్లల్లో ఉత్సాహం కనిపిస్తుంది. నిత్యం పిల్లలను బడికి పంపేముందు, వచ్చాక వారిని విష్ చేయడం మరువొద్దు. ఇది వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పిల్లలు తరగతి గదుల్లో ఎలా ఉంటున్నారో ఉపాధ్యాయులతో ఆరా తీయండి. కేవలం బడికి వచ్చే సమయంలోనే ఏడుస్తున్నారా? లేదా ముభావంగా ఉంటున్నారా.. రోజంతా అలాగే ఉంటున్నారా అనే విషయాలు తెలుసుకోండి. అలా ఉండేందుకు గల కారణాల గురించి టీచర్లతో చర్చించండి. ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు.