సిద్దిపేట టౌన్, జూన్ 22 : మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం సూచించారు.. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో నిర్దేశిత కేసుల్లో కక్షిదారులు రాజీకుదుర్చుకునేలా ప్రయత్నించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి ఇరువర్గాలతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు శ్రావణి, సంతోష్‌కుమార్, న్యా యవాదులు జనార్దన్‌రెడ్డి, శివచరణ్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లికార్జున్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
తొగుట, జూన్ 22 : చిన్నచిన్న సమస్యలు గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని దుబ్బాక ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎండీ ఉమర్ అన్నారు. బుధవారం తొగుట ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు గొడవ పడి కేసులు పెట్టుకొని కోర్టులు చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వారి పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయన్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోవడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న వారికి అధికారులు నచ్చజెప్పాలన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవరించాలని తెలిపారు. చట్ట పరిధిలోని రాజీ కుదుర్చుకునే కేసులు ఉంటే ఈనెల 26న జరిగే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఎంపీపీ లతానరేందర్, సర్పంచ్ కొండల్‌రెడ్డి, సీఐ కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో, ఎంపీవో, సీనియర్ న్యాయవాదులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి, జూన్ 22: ఈనెల 26న నిర్వహించనున్న మెగా లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్, లాక్డౌన్లో పెట్టిన కేసులను కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి పరిష్కరించుకోవాలని సూచించారు.