న్యాల్కల్, జూన్ 22 : టీఆర్ఎస్ పాలనలోనే అన్నిరంగాల్లో జహీరాబాద్ పట్టణాభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే కోనింటి మానిక్‌రావు అన్నారు. సంగారెడ్డి జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. జహీరాబాద్ పట్టణాభివృద్ధికి సీఎం ఎస్డీపీ పథకం కింద రూ. 50 కోట్లను మంజూరు చేశారన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణాభివృద్ధికి మరో రూ.40 కోట్లను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. నారింజ వాగు ప్రాజెక్టు పరిధిలో పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసి టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. నిమ్జ్‌లో భారీగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నందున జహీరాబాద్‌లో ఐటీఐని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే కోరారు.
ఈ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున్న చెరుకు పంట సాగు చేస్తారన్నారు. కొత్తూర్ గ్రామ సమీపంలోని చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా గానీ లేదా ప్రైవేటు పరంగా గానీ సరిగ్గా నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.