దుబ్బాక, జూన్ 22 : కంచె చేను మేసిన చందంగా దుబ్బాక పీఏసీఎస్ కార్యాలయంలో సీఈవో వ్యవహారం బయటపడింది. రూ.34 లక్షలు స్వాహా చేసినట్లు తెలుస్తున్నది. ఇందులో రూ.2 లక్షలు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది పీఏఫ్ డబ్బులు కావ డం విశేషం. రెండు నెలల క్రితం నిర్వహించిన ఆడిట్లో దుబ్బాక సీఈవో బాగోతం బయటపడగా, అధికారులు విస్తుపోయారు. కొద్ది రోజులుగా ఆయన విధులకు రాకపోవడంతో అతడి వైఖరిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం తెలిసింది.
పీఏసీఎస్‌లో భారీగా డబ్బులు స్వాహా చేయడంలో సీఈవో ఒక్కరే ఉం డోచ్చా? లేదా? అతడితో పాటు మరికొందరు ఉండవచ్చా? అనే సందేహాలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరోనా సమయంలో మార్క్‌ఫెడ్ నుంచి రూ.32 లక్షల విలువైన రసాయన ఎరువులను దుబ్బాక పీఏసీఎస్ దిగుమతి చేసుకుంది. ఆ ఎరువులను రైతులకు విక్రయించింది. అయితే, రెండు నెలల క్రితం ఆడిట్ జరిగింది. ఇందులో మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.32 లక్షలు బకాయి ఉం డటం, కార్యాలయంలో ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులు రూ.2లక్షలు అకౌంట్లో జమ చేయకుండా సీఈవో సొంతానికి వాడుకున్నట్లు తేలింది. కొద్ది రోజులుగా సీఈవో తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి, అందుబాటులో లేకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ విషయంపై బుధవారం దుబ్బాక పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ కైలాస్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పాలకవర్గ సభ్యులు విచారణాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేకాధికారి రాజశేఖరవర్మకు తీర్మాన పత్రం అందజేశారు. సీఈవో లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేస్తూ, అతడి నుంచి డబ్బులు రికవరీ కోసం చర్యలు చేపడుతున్నట్లు పాలకవర్గం పేర్కొన్నది.