మెదక్ మున్సిపాలిటీ, జూన్ 22: పరస్పర బదిలీ కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జోన్ల వారీగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ జాబితాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 153 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలుగనున్నది. ఇతర జిల్లాలోని ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు కూడా పరస్పర బదిలీ అవకాశంతో సొంత జిల్లాకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో ప్రభుత్వం 317 జీవో కింది జోన్ల కేటాయింపు దృష్ట్యా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆయా జిల్లాలకు కేటాయించారు. తప్పని పరిస్థితుల్లో సొంత జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు చాలామంది వెళ్లాల్సి వచ్చింది. తిరిగి సొంత జిల్లాకు రావాలని పరస్పర బదిలీకి అవకాశం ఇవ్వాలంటూ ఉపాధ్యాయుల నుంచి క్యాడర్ వారీగా విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. పరస్పర బదిలీల అవకాశంతో ఇతర జిల్లాల్లో పని చేస్తున్న కొంతమంది సొంత జిల్లాలకు రానున్నారు.