కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మర్కూక్ మండల కేంద్ర సమీపంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ పర్యాటక శోభను సంతరించుకున్నది. ఈ జలాశయం హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలకు దగ్గరగా ఉండడంతో పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. సెలవు రోజుల్లో సొంత వాహనాలపై పర్యాటకులు వేలాదిగా తరలి వస్తుండడంతో ప్రాజెక్టు సందడిగా మారుతున్నది. కొండపొచమ్మ సాగర్ నుంచి మొదలుకొని ఏడుపాయల ఆలయం వరకు పర్యాటకాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.1500 కోట్లు ప్రకటించారు. ఆ నిధులతో పర్యాటకులకు సకల వసతులతో పాటు పార్కులు ఏర్పాటు చేయనున్నారు. జలాశయంలో షికారు కోసం 20సీట్ల కెపాసిటీ గల రెండు బోట్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా జంట నగరాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
మర్కూక్, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎనిమిదేండ్లుగా ఎంతో కృషిచేస్తున్నది. సీఎంగా కేసీఆర్ మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను విడతల వారీగా చేపట్టి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసింది. రెండేండ్ల క్రితమే ప్రాజెక్టులోని నీళ్లను వదలడంతో రైతులోకం ఆనందంలో మునిగింది. మూడు నెలల క్రితం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో స్వయంగా సీఎం కేసీఆర్ జిల్లాలో ప్రాజెక్టుల దగ్గర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి రూ. 1500 కోట్ల నిధులు ప్రకటించారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు హైదరాబాద్‌కు సమీపంగా ఉండడంతో సెలవు దినాల్లో పర్యాటకులతో రద్దీగా మారుతున్నది. కొండపోచమ్మ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిధులు ప్రకటించడంతో స్థానికులతో పాటు పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్ర సమీపంలో ఐదేండ్ల క్రితం కొండపోచమ్మసాగర్ నిర్మాణ పనులు ప్రారంభించి, అనంతరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. 15 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
కొండపోచమ్మసాగర్ నిర్మించడంతో మర్కూక్ మండలానికి పర్యాటక కళ సంతరించుకున్నది. ఇక్కడి నుంచి నాలుగు జిల్లాలకు సాగునీటి అందించేందుకు కాల్వలను నిర్మించారు. ప్రారంభం నుంచి ప్రతి ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంటున్నది. జంటనగరాల నుంచి వందలాది పర్యాటకులు ప్రతి ఆదివారం తమ పిల్లలతో కొండపోచమ్మ సాగర్‌ను సందర్శిస్తున్నారు. అక్కడే వంటలు చేసుకుని వన భోజనాలు చేసి సందడి చేస్తున్నారు.
ప్రతి ఆదివారంతో పాటు వివిధ వారాల్లో వచ్చే పర్యాటకులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడానికి నిధులు కేటాయించారు. కొండపోచమ్మసాగర్ వద్ద 5 నుంచి 10 ఎకరాల భూమి సేకరించి అందులో పర్యాటకులకు వసతుల కల్పనతో పాటు ఆటలు ఆడేందుకు క్రీడా సామగ్రి, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. హరిత హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు బోటు షికారు చేసేందుకు సాగర్‌లోని రెండు బోట్లను 20 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే బోటును ప్రారంభించనున్నారు. అలాగే జంట నగరాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు కృషిచేస్తున్నారు.

కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులు దగ్గరలోని ఉన్న దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ రిజర్వాయర్ సమీపంలో రెండో కంచిగా పేరుగాంచిన శ్రీవరదరాజులస్వామి దేవాలయం వర్ధరాజ్పూర్లో ఉంది. కొండపోచమ్మ ప్రాజెక్టును సందర్శించిన పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు రవాణ సౌకర్యం ఉంది. ఈ దేవాలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను కేటాయించింది. త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నది. కొండపోచమ్మసాగర్‌కు రాకముందే వర్గల్లో సరస్వతి ఆలయం ఉంది. అక్కడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన పర్యాటకులు రెండు దేవాలయాలతో పాటు మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టులను సందర్శించవచ్చు. మధ్యలో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాల దర్శనం చేసుకోవచ్చు. పర్యాటకులకు ఆహ్ల్లాదం పంచడంతో పాటు ఆధ్యాతిక కేంద్రంగా కొండపోచమ్మసాగర్ కేంద్ర బిందువుగా మారనున్నది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొండపోచమ్మ సాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. రిజర్వాయర్‌ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తాం. చిల్డ్రన్ పార్కు, అడ్వంచర్ పార్కు, హరిత హోటల్‌తో పాటు రెండు బోట్లను ఏర్పాటు చేస్తాం. సీఎం ఆదేశాల మేరకు 5 నుంచి 10 ఎకరాల స్థలంలోని అద్భుతంగా అన్ని రకాల పార్కులను నిర్మిస్తాం. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తాం.
– ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్
