ఆకునూరుకు చెందిన కర్రె లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు అన్ని రకాల ఆకుకూరలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర పంటలవైపు మొగ్గు చూపుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. 20 ఏండ్లుగా తమకున్న ఎకరం భూమిలో ఆకుకూరలు సాగుచేయడమే కాకుండా వాటిని మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించి, ఆర్థ్ధికంగా నిలదొక్కుకోవచ్చునని చెబుతున్నారు.
– చేర్యాల, జూన్ 16
లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు 25 ఏండ్ల కింద కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్నసిరిసిల్లా) కొదురుపాక గ్రామానికి వలస వచ్చారు. అక్కడే వ్యవసాయ పనులు చేస్తూ, ఎకరం భూమి కొనుగోలు చేసి, ఆకుకూరల సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పాలకూర, చుక్క కూర, గంగవాయిలీ కూర, పచ్చకూర తదితర అన్ని రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. ప్రతి సీజన్లో పండుగలు, పెండ్లిలకు వాటిని సరఫరా చేస్తున్నారు. పెండ్లిడ్ల సీజన్లో, పలువురు హోటల్స్ నిర్వాహుకులు, పలువురు వ్యాపారులు వ్యవసాయ బావి వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు పెట్టుబడి అవుతుండడంతో రూ. 20 వేల వరకు ఆదాయం వస్తున్నదని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం వ్యవసాయానికి అనుకూలమైన రోజులు వచ్చాయి. గతంలో వ్యవసాయం చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. 24గంటలు ఉచిత కరెంటు సరఫరా, పంటలకు పెట్టుబడి వస్తుండడంతో అన్ని రకాల పంటలు సాగు చేయాలని అనిపిస్తున్నది. ఆకుకూరలు సాగులో కొన్ని మెలకువలు తెలుసుకుంటే అందరూ వాటిని సాగు చేయొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు.
-కర్రె లక్ష్మీ శ్రీనివాస్ (రైతు, ఆకునూరు)