చిలిపిచెడ్, జూన్ 16: సేంద్రియ ఎరువులపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటుందని, ఏడాది పాటు నిల్వ ఉంచిన పేడను రైతులు ట్రాక్టర్ల ద్వారా పొలాలకు తరలిస్తున్నారు. చిలిపిచెడ్ మండలంలో 75 శాతం మంది వ్యవసాయం పై ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా పాడి పశువులను పెంచుతుంటారు. ఏటా 80 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుండడంతో రైతులు సేంద్రియం వైపు మొగ్గు చూపుతున్నారు.
రసాయన ఎరువుల వాడకంతో భూసారానికి కలిగే నష్టం గురించి వివరిస్తున్నాం. పశువుల పేడలో లభించే పోషకాలతో పాటు ఎక్కువ దిగుబడి పొందే పద్ధ్దతులపై అవగాహన కల్పిస్తున్నాం.
-బాల్రెడ్డి, మండల వ్యవసాయాధికారి(చిలిపిచెడ్ )
పంటలకు ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాష్ (ఎస్-పీ-కే),పోషకాలు (మైక్రోన్యూట్రియట్స్)అవసరం ఉంటుంది. పశువుల ఎరువులో 0-5-15 శాతం నత్రజని,0.3-0.9 శాతం భాస్వరం,0.5 -1.9 శాతం పొటాష్.. కోళ్ల ఎరువుల్లో 2.3-3.0 శాతం నత్రజని,1.2-2.0 శాతం భాస్వరం, 1-2 శాతం పొటాష్.., గొర్రెలు,మేకల ఎరువులో 0.2 -0.7 శాతం నత్రజని,0.4-0.6 శాతం భాస్వరం, 0.1 – 3.0 శాతం పొటా ష్.., వర్మీ కంపోస్టులో 1.5-6.0 శాతం నత్రజని, 1.05-2.2 శాతం భాస్వరం,11 – 1.75 పోషకాలు ఉంటాయి.