న్యాల్కల్, జూన్ 16 : మండలంలోని గ్రామాల్లో వానాకాలం పంటల సాగు సందడి ప్రారంభమైంది. రైతులు ఎక్కవగా ఈ సీజన్లోనే అధికంగా పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము, జొన్న తదితర పంటలను సాగు చేస్తారు. అందులో సోయాబీన్ పంట ఒకటి. ఈ పంట సాగు చేసేందుకు నల్లరేగడి భూములు అనువైనవి, ముందుగానే భూములను చదును చేసుకొని విత్తనం విత్తుకునేందుకు సిద్ధం చేసుకోవాలి. సోయాబీన్ పంటను సాగు చేసుకునేందుకు జూలై 10వ తేదీ వరకు అవకాశం ఉందని వ్యవసాయాధికారిని లావణ్య సూచించారు. సోయా సాగులో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చన్నారు.
సోయాబీన్ పంట విత్తడం కంటే ముందుగా ప్రతి కిలో సోయాబీన్ విత్తనానికి 2 గ్రాముల థైరమ్, ఒక్క గ్రాము కార్బండిజమ్ లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టన్ మందుతో, తర్వాత 5 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోస్ఫాన్తో విత్తనం శుద్ధి చేయాలి. ప్రిత 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ కలిపి నీడలో అరబెట్టాలి. అ తర్వాత విత్తుకోవాలి. నల్లరేగడి భూముల్లో అయితే 45 సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీ మీటర్ల దూరం, తేలిక భూముల్లో అయితే 30 మీటర్ల వెడల్పు, 7.5 సెంటీ మీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరానికి సుమారుగా 25 నుంచి 30 కిలోల వరకు సోయాను విత్తుకోవాల్సి ఉంటుంది.
సోయాబీన్ పంటలో కలుపు నివారణ కోసం పెండిమిథాలిన్ 30 శాతం 1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. సోయా విత్తిన 20-25 రోజుల్లో గొర్రుతో అంతర క్రషి చేయాలి. లేకుంటే కిజాల్ఫాస్ ఇథైన్ 5 శాతం 400 మిల్లీ లీటర్ల కలిపి పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను, ఇమాజిథాఫైర్ 10 శాతం 250 మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసి వెడల్పుకు, గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. ఆయా మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సోయాబీన్ సాగు చేసే భూముల్లో ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ ఫాస్పెట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభిస్తుంది. 50 శాతం నత్రజని విత్తేటప్పుడు, పైరు నెల రోజులకు చేరిన తర్వాత మరో 50 శాతం నత్రజని వేయాలి. సోయా పంట ఎదుగుదలకు పూత, కాత దశలో 2 శాతం యూరియా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పంటలకు చిత్త పురుగులు, రసం పీల్చే పురుగు, కాండం తొలిచే పరుగు, ఈగ, ఆకు గూడు పురుగు, పొగాకు లద్దె పురుగులు అశిస్తాయి. వీటి నివారణకు ఒక గ్రామ్ ఎస్సీఫేట్ లేదా మోనోక్రోటోఫాస్ 6 మిల్లీ లీటర్లు లేదా క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
సోయాబీన్ వర్షాధారపు పంట. ఈ పంట మొలక దశ, పూత దశ, కాయ దశలో నీటి తడులివ్వాలి. ఆయా దశలో తప్పకుండా నీటి కొరత లేకుండా చూసి అధిక దిగుబడిని సాధించవుచ్చు. స్ప్రింక్లర్ పద్ధతిలో పైరుకు నీరివ్వడంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నీరందించవచ్చు. సెప్టెంబర్ మాసంలో అవసరాన్ని బట్టి సోయాకు 1-2 తడులిస్తే మంచిది.
-లావణ్య, మండల వ్యవసాయాధికారి, న్యాల్కల్