మెదక్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించిన ‘మీ కోసం నేనున్నాను’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. గురువారం మెదక్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పాపన్నపేట, మెదక్ పట్టణం, మెదక్ మండలం, రామాయంపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట, హవేళీఘనపూర్ మండలాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవించుకున్నారు. ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలు, ఇతర సమస్యలను ఎమ్మెల్యేకు 60 మంది లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
ప్రజా సమస్యలను ఓపికతో విన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులకు వివరించి పరిష్కరించాలని సూచించారు. పింఛన్ సమస్యలు, దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్ కోసం డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి అర్హులైన వారిని గుర్తించి పింఛన్ అందజేయాలని, దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాటరీ వెహికల్స్ మంజూరు చేయాలని ఆదేశించారు. భూమి, కల్యాణలక్ష్మి సమస్యలను పాపన్నపేట, రామాయంపేట తహసీల్దార్లతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ‘మీకోసం నేనున్నాను’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, అధికారులు తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు సోములు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ కౌన్సిలర్లు వంజరి జయరాజ్, కిశోర్, నియోజకవర్గంలోని మండలాల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు లింగారెడ్డి, కిష్టయ్య, కృష్ణ, మధుసూదన్‌రావు, మధు, రాజేశ్వర్‌రావు, సతీశ్‌రావు, అశోక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట, జూన్ 16: ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పాపన్నపేట మండలం పరిధిలోని మిన్పూర్, యూసూఫ్‌పేట గ్రామాల్లో గురువారం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అముల చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.