దుబ్బాక టౌన్, జూన్ 15 : ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ అన్నారు. బుధవారం దుబ్బాకలో పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులను చైర్పర్సన్ వనితాభూంరెడ్డితో కలిసి పరిశీలించారు. దుబ్బాక పర్యటనలో భాగంగా మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించి 15 రోజుల్లోగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
సమీపంలో సప్తగిరి వెంచర్లో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీని పరిశీలించి వందశాతం మొక్కలను పెంచే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. లచ్చపేటలో ఏర్పాటు చేస్తున్న వర్మీ కంపోస్టు షెడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం దుబ్బాకలో పాత ప్రభుత్వ దవాఖాన భవనం కూల్చివేత పనులను పరిశీలించి అదే స్థలంలో మంజూరైన రూ.3 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించాలని ముజామ్మిల్‌ఖాన్ ఆదేశించారు.
మున్సిపల్ కార్యాలయంలో నిరుద్యోగ యువతులకు మగ్గం వర్క్‌పై ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణంలో రెండు క్రీడా మైదానాలను ఈనెల 18లోపు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ గణేశ్‌రెడ్డి, నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
హుస్నాబాద్ టౌన్, జూన్ 15 : పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న కోరారు. పట్టణంలో 5, 16వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించామన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అనిత, మాజీ ఎంపీపీ వెంకట్, కౌన్సిలర్లు భాగ్యారెడ్డి, జనగామ రత్న, అధికారులు పాల్గొన్నారు.
వర్గల్, జూన్ 15 : మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, కరెంట్ తీగల సవరణ, నీటి ట్యాంకుల శుద్ధీకరణ వంటి పనులు చేపట్టారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ముళ్లపొదలను తొలిగించి ప్రధాన కూడళ్లను శుభ్రం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.