సిద్దిపేట, జూన్ 15 :“ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎనిమిది సంవత్సరాల్లోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారం’గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం సిద్దిపేటలో జరుగగా.. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..సిద్దిపేట మార్కెట్ కమిటీకి తొలి మహిళా చైర్ పర్సన్‌గా మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి ఎన్నిక కావడం అదృష్టమన్నారు.
దేశంలోనే మార్కెట్ మహిళా రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు సిద్దిపేటలో ఐదు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో మాత్రమే వ్యవసాయ గోదాములు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలో లక్షా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గోదాములు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం జరిగిందన్నారు.
యాసంగి పంట కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 25 లక్షల ఎకరాల్లో వరి పండించగా తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో వరి పండించడం జరిగిందన్నారు. రైతు బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందడానికి ఇతర రాష్ర్టాల కూలీలు రాష్ర్టానికి వస్తున్నారన్నారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు పాల్గొన్నారు.