నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15 : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల మేలు కొరి ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన ‘కొలువు-గెలువు’ అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి పోటీ పరీక్షల అభ్యర్థులు సదస్సుకు తరలివచ్చారు.
పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధ్యమని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆత్మీయ అతిథులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,ఎమ్మెల్సీలు ఫరూఖ్హుస్సేన్, డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ప్రధాన వక్తలుగా సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరక్టర్ డాక్టర్ సీఎస్ వేప హాజరై మార్గనిర్దేశనం చేశారు. సివిల్ ర్యాంకర్లు అఖిల్, శ్రీధర్ సైతం వారి అనుభవాలను అభ్యర్థులకు తెలియజేశారు. ఎజాస్ అహ్మద్ ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఉదయం 10గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. ముఖ్య అతిథుల ప్రసంగాలను అభ్యర్థులు శ్రద్ధగా విన్నారు. ఉద్యోగాలు సాధించేందుకు ప్రిపేరయ్యే పద్ధతులు, మెలకువలను ప్రధాన వక్తలు తెలియజేయగా, అభ్యర్థులు నోట్ చేసుకున్నారు. సదస్సుకు వెయ్యి మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు రావడంతో విపంచి ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. నమస్తే తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇన్చార్జి కత్తుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నెట్వర్క్, సర్క్యులేషన్ సిబ్బంది అభ్యర్థులకు కావాల్సిన వసతులను సమకూర్చారు.
సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికలతో పాటు నిపుణ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధ్దంగా చదవాలని సదస్సులో వక్తలు, ముఖ్యఅతిథులు సూచించారు. ప్రధాన వక్తలు బాలలత, వేప చేసిన ప్రసంగాలకు అభ్యర్థులు ముగ్ధులయారు.
పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులను చైతన్యం చేసి, వారిలో ప్రిపరేషన్ స్కిల్స్ పెంచుతున్న బాలలత, వేపలతో పాటు సివిల్ ర్యాంకర్లను మంత్రి హరీశ్‌రావు శాలువాలు కప్పి సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ సదస్సులో ఈవెంట్స్ మేనేజర్ గణేశ్, జిల్లాలోని ఆర్సీ ఇన్చార్జిలు రాగుల కరుణాకర్, దరిపెల్లి రాజు, తుంగ పవన్‌కుమార్, అవదూత బాల్‌రాజు, వివిధ మండలాల విలేకరులు, సర్క్యులేషన్ ప్రతినిధులు నవీన్, నబీ తదితరులు పాల్గొన్నారు.

సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు తీవ్ర అన్యాయం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మన పిల్లలకే ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ కొత్త జోనల్ విధానం తెచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆధ్వర్యంలో ఇంత పెద్దఎత్తున అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయం. నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పోటీ పరీక్షల్లో మొదటిసారి ఓటమి చెందితే కుంగిపోవద్దు. ఓటమిని విజయానికి నాందిగా మార్చుకోవాలి. కష్టపడడంలో మనమంతా మంత్రి హరీశ్‌రావును స్ఫూర్తిగా తీసుకోవాలి.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ
సాధించగలమనే నమ్మకంతో పోటీ పడితేనే విజయం సొంతమవుతుంది. హైదరాబాద్‌తో పోల్చి తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు. నేను కూడా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని డాక్టర్ అయ్యా. మెడిసిన్‌లో మొదటిసారి ర్యాంకు రాలేదు. రెండోసారి ప్రయత్నించి 36వ ర్యాంకు ఉస్మానియా వైద్య కళాశాలలో డాక్టర్ సీటు సాధించా. ఆత్మన్యూనతను అభ్యర్థులు వీడాలి. ఇంపాజిబుల్ వార్డులోనే.. అయామ్ పాజిబుల్ ఉంది. అయామ్ పాజిబుల్ అని నమ్ముకుని సాధించాలి.
-ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవ్రెడ్డి
‘నమస్తే తెలంగాణ’ ఆహ్వానం మేరకు నిపుణులు బాలలత, డాక్టర్ వేప సిద్దిపేటకు వచ్చి అవగాహన కల్పిస్తున్నందున ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగం సాధించే క్రమంలో ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందవద్దు. జాతీయస్థాయిలో వెలువడే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి ఏ అవసరం ఉన్నా తాము సహకారం అందిస్తాం. టెట్‌లో 630 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడంతో పాటు 1300మంది అభ్యర్థులకు ఉచిత పోలీస్ కోచింగ్, మెటీరియల్ అందించి శిక్షణ ఇస్తున్నాం. మీరు అంతిమ లక్ష్యం చేరే వరకు పూర్తి సహకారం అందిస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఒక రేకుల షెడ్లో ఉండి.. రాత్రింబవళ్లు చదువుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సివిల్స్ ర్యాంకు సాధించిన అఖిల్‌ను, ఒక కానిస్టేబుల్ కొడుకు అయి ఉండి సివిల్స్ ర్యాంకు సాధించిన శ్రీధర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఉద్యోగార్థి చిత్తశుధ్దితో చదివి లక్ష్య సిద్ధిని సాధించాలి. గతంలో సిద్దిపేటలో కోచింగ్ ఇచ్చిన వారిలో చాలా మంది పేద కుటుంబం వారు ఉద్యోగాలు సాధించారు. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అంతేకాకుండా అన్ని ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి
ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు నిరంతరం సాధన చేయాలి. మొదటి ప్రయత్నంలోనే విజయం వరించదు. ఒక్కసారి ఫెయిలైతే జీవితమంతా ఫెయిల్ అయినట్లు కాదు. విజయం సాధించే వరకు ప్రయత్నించాలి. విజయం సాధించిన వారిని రోల్‌మోడల్‌గా తీసుకోవాలి. అందుబాటులో ఉన్న వన రులను సద్వినియోగం చేసుకొని టార్గెట్ రీచ్ కావాలి. ఉద్యోగం సాధించడం ఒక ఎత్తయితే, ఉద్యోగం సాధించాక సామాజిక బాధ్యతను నిర్వర్తించడం అంతే ముఖ్యం.
ముజామ్మిల్‌ఖాన్, అడిషనల్ కలెక్టర్ ,సిద్దిపేట
ప్రతి రంగంలోనూ గెలుపోటములు ఉంటాయి. ఒకసారి ప్రయత్నానికే ఉద్యోగం రాకపోతే డీలా పడవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. రాజకీయాల్లోనూ గెలుపు, ఓటములు ఉంటాయి. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా యువత కోసం ఏటా ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇలాంటి సదస్సు నిర్వహించడం అభినందనీయం. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ వాళ్ల తాత ఐఏఎస్, నాన్న ఐపీఎస్, ఆయన కూడా తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించారు. మళ్లీ పట్టుబట్టి ఐఏఎస్ సాధించారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని యువత ఉద్యోగాలు సాధించాలి.
-ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్సీ
నిరుద్యోగ యువత కోసం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపడం అభినందనీయం. కష్టాలను ఎదుర్కొని నిలబడితేనే విజయం సొంతమవుతుంది. పట్టుదల, లక్ష్యం రెండు కండ్లుగా భావించి ప్రయత్నిస్తే విజయం తప్పక సిద్ధిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధ్దమవుతున్న యువత భోజనం, నిద్ర రెండు కొంచెం తగ్గించి చదువుపై ఏకాగ్రత పెట్టాలి. నిపుణుల సూచనలను ఆచరణలో పెట్టాలి. ఉచిత కోచింగ్, ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. సిద్దిపేట జిల్లా యువత అత్యధిక ఉద్యోగాలు సాధించి పేరు తేవాలి.
– వేలేటి రోజాశర్మ, జడ్పీ చైర్పర్సన్, సిద్దిపేట