నర్సాపూర్, జూన్15: పోటీ ప్రపంచంలో కష్టపడితేనే ఫలితం లభిస్తుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను ఎమ్మెల్యే, ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి అందజేశారు. టీఆర్ఎస్ నాయకుడు వెంకన్నగారి నవీన్‌రావు పుట్టినరోజు సందర్భంగా సుమారు 5 లక్షల విలువ చేసే స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమన్నారు. అప్పట్లో 40 మార్కులు వస్తే గొప్ప విషయమని, నేడు 90 వచ్చినా సాధారణమేనని తెలిపారు. ఎస్పీ, డీఎస్పీ సూచనలతో నర్సాపూర్‌లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు ఉద్యోగం సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం రానివారు అసంతృప్తి చెందొద్దని, వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్టడీ మెటీరియల్ అందజేసిన నవీన్‌రావును అభినందించారు.
ఉచిత శిక్షణ కేంద్రంలో నిర్వహించే టెస్టులకు ప్రతి అభ్యర్థి సిద్ధంగా ఉండాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్‌లో శిక్షణా తరగతులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్ని విధాలా సహకరించారన్నారు. అభ్యర్థులు ఉద్యోగం సంపాదించి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. పోటీని తట్టుకుని విజయం సాధించాలన్నారు. ప్రతి సిలబస్‌ను రివిజన్ చేయడం ముఖ్యమన్నారు. ప్రతిఒక్కరూ శిక్షణా తరగతులకు హాజరై, పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. స్టడీ మెటీరియల్ బాగున్నదని, ఇందుకు సహకరించిన నవీన్‌రావుకు అభినందనలు తెలిపారు.
పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులకు ఏకాగ్రత చాలా ముఖ్యమని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణా తరగతులకు హాజరయ్యే అభ్యర్థులు ఎక్కువ శాతం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారనన్నారు. పట్టుదలతోనే విజయం సాధ్యమన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. సమయం వృథా చేయకుండా కష్టపడి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, సీఐ షేక్‌లాల్ మధార్, ఎస్సై గంగరాజు, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌గుప్తా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.