మెదక్, జూన్15 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ప్రధానంగా పంట పొలాలకు పశువుల పెంట తరలించడం, గత సీజన్లో సాగు చేసిన పంటల వ్యర్థాలు తొలగించే పనులు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా రైతులు దుక్కి దున్ని విత్తనాలు నాటేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఈసారి సాగయ్యే వరి, పత్తి పంట విస్తీర్ణం మరింత పెరగనున్నదని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది.
వానకాలం 2022లో మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 3,31,280 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా 1,75 లక్షల ఎకరాల్లో వరి, 92 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అంచనా. కంది 21వేల ఎకరాలు, మొక్కజొన్న 19 వేల ఎకరాలు, జొన్న 3వేల ఎకరాలు, మినుములు 3వేల ఎకరాలు, పెసర 4వేల ఎకరాలు, మరో 9వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు.
జిల్లాలో సాగు కానున్న మొత్తం 3,31,280 ఎకరాలకు అవసరమున్న ఎరువులు, విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 97 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండనున్నాయి. వీటిలో యూరియా 41వేల మెట్రిక్ టన్నులకు గాను 34,518 మెట్రిక్ టన్నులకు ప్రతిపాదనలు పంపారు. డీఏపీ 8600 మెట్రిక్ టన్నులకు 8450 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 34,200 మెట్రిక్ టన్నులకు 31,353 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 8750 మెట్రిక్ టన్నులకు 8370 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 4500 మెట్రిక్ టన్నులకు 4228 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. 43,750 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలు అవసరం కానున్నాయని అంచనా వేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్లో యూరియా 6482 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ 150 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2847 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 380 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 272 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు.
వానకాలం సీజన్లో ఆయా జిల్లాలో ఏయే రకాలైన పంటలు వేయించాలో సూచించే క్రాప్ కార్డును ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో వరి, పత్తి ఎక్కువగా సాగు చేయించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి సంవత్సరం వానకాలం సీజన్లో జిల్లాలో ఎక్కువ గా వరి సాగు చేస్తుంటా రు. ఈ ఏడాది పత్తి పంట పట్ల ఆసక్తి కనబర్చేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో ఈ సీజన్లో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉం చుతాం. వానకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి. జిల్లాలో వానకాలంలో 3,31,280 లక్షల ఎకరాల్లో సాగుకు అంచనా వేశాం. ఇందులో వరి 1,75 లక్షలు కాగా, పత్తి 92వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– పరుశురాంనాయక్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మెదక్
పంట ఎకరాల్లో…
వరి 1.75 లక్షలు
పతి 92వేలు
కంది 21వేలు
మొక్కజొన్న 19వేలు
జొన్నలు 3వేల ఎకరాలు
మినుములు 3వేల ఎకరాలు,
పెసర 4వేల ఎరాలు
ఇతర పంటలు 9వేల ఎకరాలు