MLC Elections | మెదక్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా పరిధిలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డ్రిస్టిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామ్రగిని అందజేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు వారిని తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. టీచర్స్ ఎన్నికలకు 21 పోలింగ్ కేంద్రాలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు 22 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని విధులను నిర్వర్తించాలన్నారు. ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ ఓటర్స్ -1347, గ్రాడ్యుయేట్ ఓటర్స్-12472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ కార్య్రకమంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు త్రూపాన్ జయచంద్రారెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, డీఈఓ రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.