మెదక్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో నవజాతి శిశువుల ప్రత్యేక విభాగాన్ని పరిశీలించారు. నవజాతి శిశువులకు అందుతున్న వైద్య సేవల గురించి సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో జూన్‌లో 350 ప్రసవాలు , ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు 50 మేజర్ సర్జరీలు జరిగాయన్నారు. గత సంవత్సరం సుమారు 150 నుంచి 200 ప్రసవాలు జరిగాయని, ఇప్పుడు ఆసంఖ్య ప్రతి నెలా 300 నుంచి 400కు పెరిగిందన్నారు.
ప్రతి పీహెచ్సీ పరిధిలోని గర్భిణులను ట్రాక్ చేస్తూ వారికి ఆశ, ఏఎన్ఎంలను అటాచ్ చేసి 102 వాహనాలు సన్నద్ధం చేస్తూ ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచుతున్నామన్నారు. గర్భిణులకు అవసరమైన టిఫా సానింగ్, ఇతర పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఓపీ అధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. గైనిక్ సేవలే కాకుండా మిగిలిన విభాగాలను సైతం ప్రభుత్వ దవాఖానలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దవాఖాన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్లు ఉన్నారు.
గిరిజన వసతి గృహం తనిఖీ
మెదక్ మున్సిపాలిటీ, జూలై 12: గిరిజన విద్యాలయాలు, వసతి గృహాలు విద్యార్థుల పాలిట ఆశా దీపాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల, వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వసతిగృహంలో పలు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మెనూ, వంట గది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, వివిధ సౌకర్యాలను వార్డెన్‌తో కలిసి పరిశీలించారు. సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మెదక్ జిల్లాలోని 8 ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు రూ. 2.21 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.