
అత్యుత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులు
కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు
నేడు ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి ప్రవేశ పరీక్ష
పరీక్ష రాయనున్న 1492 మంది విద్యార్థులు
మెదక్ జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 20 : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం ఆదర్శ(మోడల్) పాఠశాలలను ప్రారంభించింది. దీంతో పాఠశాలల్లో ఏటా వందలాది మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారు. సువిశాల గదులు, గ్రంథాలయాలు, అధునాతన ల్యాబ్‌లు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతి నుంచి పదో తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నేడు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష తెలుగు ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. మొత్తం వంద మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. ఆరో తరగతికి హాజరయ్యే విద్యార్థులు ఐదో తరగతి సిలబస్, ఏడు నుంచి పదో తరగతికి హాజరయ్యే విద్యార్థులకు ఆయా తరగతులకు సిలబస్‌లకు అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ పాఠ్యంశాలపై 25 మార్కుల చొప్పున ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా తరగతుల్లో ప్రవేశం ఉంటుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 12వరకు, 7 నుంచి 10వ తరగతుల ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు నిర్వహిస్తారు. జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏడు పరీక్షా కేంద్రాల్లో 1492 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 955 మంది విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు, 537 మంది 7 నుంచి పదో తరగతి ప్రవేశ పరీక్ష రాయనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలని చేరుకోవాలని, ప్రతి విద్యార్థి మాస్క్‌తో పాటు శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని విద్యాశాఖధికారులు సూచిస్తున్నారు.
విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. విద్యార్థులు http:// telangana.cgg. gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాల్లో 1492 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.
-రమేశ్‌కుమార్, డీఈవో, మెదక్
మెదక్ జిల్లాలో పరీక్షా కేంద్రాలు
ఆదర్శ పాఠశాల తిరుమలపూర్, చిన్నశంకరంపేట మండలం
ఆదర్శ పాఠశాల రేగోడ్
ఆదర్శ పాఠశాల టేక్మాల్
ఆదర్శ పాఠశాల కోమట్‌పల్లి, రామాయంపేట మండలం
ఆదర్శ పాఠశాల వడియారం, చేగుటం మండలం
ఆదర్శ పాఠశాల, పెద్ద శంకరంపేట
ఆదర్శ పాఠశాల జక్కపల్లి, నర్సాపూర్ మండలం